Nov 11,2023 19:27

ఉపాధ్యాయుడు శంకర్‌నాయుడును విచారిస్తున్న విచారణాధికారి

ప్రజాశక్తి-విజయనగరంటౌన్‌, పూసపాటిరేగ :  విద్యాబుద్ధులు నేర్పించాల్సిన గురువు విద్యార్థినులపై లైంగిక వేదింపులకు పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. పూసపాటిరేగ మండలం చోడమ్మ అగ్రహారం ఎంపియుపి పాఠశాలలో పని చేస్తున్న శంకర్‌ నాయుడు అనే ఉపాధ్యాయుడు విద్యార్థినులపట్ల లైంగిక వేదింపులకు పాల్పడినట్లు తెలిసింది. ఇదే విషయమై మండల విద్యాశాధికారులకు కూడా గ్రామస్థులు ఫిర్యాదు చేశారు. ఈ సంఘటన గత మంళవారం జరగ్గా విషయం బయటకు రాకుండా గ్రామస్థులతో రహస్య మంతనాలు జరిపినట్లు తెలుస్తోంది. విద్యార్థిని తల్లిదండ్రులను, ఫిర్యాదు చేసేందుకు వచ్చిన యువకులను అదే ఊరిలో ఓ ఇంటిలో సమావేశపరిచి విషయం బయటకు రాకుండా ఆ ఉపాధ్యాయుడ్ని కాపాడే ప్రయత్నం చేసినట్లు తెలిసింది. శనివారం సాయంత్రం జిల్లా విద్యాశాఖాధికారులకు విషయం తెలియడంతో ఉపాధ్యాయుడి తీరుపై విద్యాశాఖ కార్యలయంలో చర్చకు దారితీసింది.
చక్రం తిప్పిన ఎంఇఒ?
ఉపాధ్యాయుడిపై చర్య తీసుకోవాల్సిన ఎంఇఒ రాజ్‌కుమార్‌ విషయం బయటకు రాకుండా చక్రం తిప్పినట్లు ప్రచారం జరుగుతోంది. విద్యార్థినులు, తల్లిదండ్రులు మంగళవారం మండల విధ్యాశాధికారికి ఫిర్యాదు చేయగా, రాత పూర్వక ఫిర్యాదు తీసుకోకుండా తాను వచ్చి చూస్తానని చెప్పి తల్లి దండ్రులకు నచ్చచెప్పి స్కూలు సమయం అయిన తర్వాత ఆ గ్రామానికి వెళ్లి ఓ ఇంట్లో తల్లి దండ్రులను, పెద్దలను , ఉ పాధ్యాయుడిని కూర్చోబెట్టి చర్చించినట్లు తెలిసింది. ఉపాధ్యాయుడిని మందలించి. తల్లిదండ్రులను ఒప్పించి గొడవ సద్దుమణిగేలా ఎంఇఒ చక్రం తిప్పినట్లు తెలిసింది. ఉపాధ్యాయుడు లైంగిక వేధింపులకు పాల్పడితే చర్యలు తీసుకోవాల్సిన అధికారి ఈ విధంగా వ్యవహరించడం పట్ల కొంత మొత్తం చేతులు మారినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
మొదటి నుంచి శంకర్‌ నాయుడు వివాదస్పదుడే?
శంకర్‌ నాయుడు మొదటి నుంచి వివాస్పదుడుగానే ముద్ర పడ్డాడు. విజయనగరం కెఎల్‌ పురంలో ఉంటున్న ఆయన గతంలో సాధారణ ఎన్నికల్లో ఓ రాజకీయ పార్టీకి మద్దతిచ్చి ఎన్నికల్లో బాహటంగానే తిరిగి విద్యాశాఖనుంచి మోమో అందుకున్నారు. గంట్యాడ మండలంలో ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహించిన సమయంలో ఎంఇఒ సంతకం ఫోర్జరీ చేశాడు. ఆయన ఎక్కడి పని చేస్తే అక్కడ వివాదాలు తెచ్చుకోవడం పరిపాటిగా మారింది.
విచారణ చేపట్టిన విద్యా శాఖ అధికారులు..
విద్యార్థులపై ఉపాధ్యాయుడు శంకరనాయుడు లైంగిక వేదింపులకు పాల్పడిన ఘటనపై డిఇఒ లింగేశ్వరరెడ్డి స్పందించి విచారణకు ఆదేశించారు. గ్రామంలో విచారణ చేసి రిపోర్ట్‌ ఇవ్వాలని పూసపాటిరేగ హెచ్‌ఎం శంకరావుకు ఆదేశాలు జారీ చేశారు. దాంతో ఆయన శనివారం పాఠశాలకు చేరుకొని హెచ్‌ఎం వై. జయంతిమాలతో పాటు ఉపాధ్యాయులను, గ్రామంలో ఫిర్యాదుదారులను, ఎస్‌ఎంసి చైర్మన్‌ పైడిరాజును, సర్పంచి కొత్తకోట శ్రీరాములును పాఠశాలకు పిలిపించి విచారణ చేసారు. ఉపాధ్యాయుడిపై వచ్చినవి ఆరోపణలు కాదని, వాస్తవంగా జరిగిందని ఎంఇఒకు ఫిర్యాదు చేసామని గ్రామస్తులు తెలిపారు.
బ్యాడ్‌ టచ్‌, గుడ్‌ టచ్‌ ఏదో తెలియని విద్యార్థులను లైంగికంగా వేధిస్తున్నది వాస్తవమని తెలిపారు. అయితే లైంగికంగా ఇబ్బంది పడుతున్న విద్యార్థులను మీ ముందుకు తీసుకురాలేమని, అవసరమైతే ఒక్కొక్కరిని మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తామని తెలిపారు. ఇలాంటి విషయాలు బయటకు రాకూడదని ఉద్దేశంతోనే ఎంఇఒకు కూడా ఓరల్‌గా ఫిర్యాదు చేసామన్నారు. ఈ విషయం తెలిసిన వెంటనే పేరెంట్‌ మీటింగ్‌ పెట్టామని ఎన్‌ఎంసి చైర్మన్‌ పి. పైడిరాజు తెలిపారు. ఈ విషయం బయటకు రాకూడదనే ఉద్దేశంతో గ్రామ సర్పంచికి కూడా చెప్పలేదన్నారు. ఈ విషయం తెలిస్తే మిగతా తల్లిదండ్రులు పిల్లలను బడికి మాన్పిస్తారని ఆవేదన వ్యక్తం చేసారు. సర్పంచి శ్రీరాములు స్పందించి ఇకపై ఇలాంటి చెడ్డపనులు చేసి మా ఊరుకు, ఉపాధ్యాయ వృత్తికి మచ్చతేవొద్దని హెచ్చరించారు. విచారణ రిపోర్టును డిఇఒకు పంపుతామని హెచ్‌ఎం తెలిపారు.