ప్రజాశక్తి -అనంతగిరి:స్థానిక జూనియర్ కళాశాలలో రెండవ సవత్సరం చదువుతున్న విద్యార్థి తాడిగుడ జలపాతం వద్ద మృతి చెందిన సంఘటనలు తెలుసుకున్న రాష్ట్ర ఎస్టి కమిషన్ మెంబర్ కొర్రా. రామలక్ష్మి ఆదివారం కళాశాలను సందర్శించారు. విద్యార్థిని మృతి పట్ల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కళాశాల వద్ద ఉన్న వసతి, తాగునీటి వంటి సమస్యలపై ఆరా తీశారు. హాస్టల్ వసతి సౌకర్యం లేక ఇబ్బందులు గురవుతున్నామని, తాగునీటి సమస్య కూడా ఉందని విద్యార్థినిలు ఆమె దృష్టికి తీసుకువెళ్లారు. ఈ సందర్భంగా ఆమె స్థానిక విలేకరులతో మాట్లాడుతూ, విద్యార్థిని మృతి పట్ల తెలియని కళాశాల సిబ్బందిపై ఆమె మండిపడ్డారు. హాస్టల్‌లో విద్యార్థినిలు లేకపోయినా పట్టించుకో పోవడం విడ్డూరమని, విద్యార్థినుల ప్రాణాలతో చెలగాట మాడితే చూస్తూ ఊరుకునేది లేదని ఆమె హెచ్చరించారు. గుమ్మకోట గురుకులం పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థి, జిల్లా కేంద్రం పాడేరులో విద్యార్థినుల వరుసగా మృతి చెందడం బాధాకరమని, దీనికి పూర్తి బాధ్యత పాఠశాల, కళాశాలల సిబ్బంది వహించాలన్నారు. విద్యార్థులు తెలిపిన సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని ఆమె అన్నారు.










