ఖాజీపేట : మండల పరిధిలోని కొత్త నెల్లూరు సమీపంలోని బీరం శ్రీధర్‌రెడ్డి పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్న విద్యార్థి సోహిత్(11) అనుమానాస్పద మృతిపై విచారణ కొనసాగుతూనే ఉంది. సోమవారం ఎస్‌పి అన్బురాజన్ పాఠశాలను సందర్శించారు. సోహిత్ మృతి ఘటనకు సంబంధించి పాఠశాల సిబ్బంది, విద్యార్థులను విచారించారు. సోహిత్ ఉన్న తరగతి గది, వసతి గృహాన్ని పరిశీలించారు. వసతి గృహంలో సిసి ఫుటేజీ, పోస్ట్ మార్టం నివేదికల ఆధారంగా పూర్తి వివరాలను రెండు రోజుల్లో మీడియా సమావేశంలో వెల్లడించనున్నట్లు ఎస్‌పి తెలిపారు. సోహిత్ వేలి ముద్రలు, డాగ్ స్క్వాడ్ ద్వారా మరింత లోతుగా విచారణ చేపట్టనున్నట్లు చెప్పారు. సిసి ఫుటేజ్‌లో విద్యార్థి పైఅంతస్తు నుంచి కింద పడినట్లు ప్రాథమిక అంచనా ద్వారా వెల్లడైందని మైదుకూరు డిఎస్‌పి వంశీధర్‌గౌడ్ ఎస్‌పి అన్బురాజన్‌కు వివరి ంచారు. విద్యార్థి వసతి గృహాన్ని, తోటి విద్యార్థులను కూడా విచారించినట్లు పోలీసు ఉన్నత అధికారులు చెప్పారు. సోహిత్ మృతి ఘటనకు సంబంధించి పూర్తి వివరాలను విచారణ అనంతరం వెల్లడించనున్నట్లు చెప్పారు. కార్యక్ర మంలో మైదుకూరు రూరల్ సిఐ నరేంద్రరెడ్డి, ఎస్‌ఐ కుల్లాయప్ప, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.










