Nov 17,2022 23:48

ఆందోళన చేపడుతున్న విద్యార్థి సంఘాల నేతులు, బంధువులు

ప్రజాశక్తి-పాడేరు:జిల్లా కేంద్రంలోని లోచలిపుట్టు గిరిజన సంక్షేమ బాలుర ఆశ్రమ పాఠశాలలో ఏడవ తరగతి చదువుతున్న పాంగి నవీన్‌ మృతిపై మిస్టరీ వీడలేదు. అనుమానాస్పద రీతిలో మృతి చెందిన నవీన్‌ మృతదేహం పాఠశాలకు సమీపంలో బుధవారం సాయంత్రం వెలుగు చూసిన సంగతి తెలిసిందే. నవీన్‌ మృతదేహాన్ని గత రాత్రి జిల్లా ఆసుపత్రి మార్చురీకి తరలించినప్పటికీ గురువారం కూడా పోస్టుమార్టం చేయ లేదు. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సెక్షన్‌ 174 కింద అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసామని పాడేరు సీఐ సుధాకర్‌ విలేకరులకు తెలిపారు.
విద్యార్థి నవీన్‌ అనుమానాస్పద రీతిలో మృతి చెందిన ఘటనపై ఎస్‌ఎఫ్‌ఐ, ఏబీవీపీ, జిఎస్‌యు విద్యార్థి సంఘాలు పాఠశాల ఎదుట గురువారం నవీన్‌ బంధువులతో కలిసి బైఠాయించారు. దీంతో పాఠశాల వద్ద ఉద్రిక్తత ఏర్పడింది. ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి ప్రభు దాస్‌, ఏబీవీపీ జిఎస్‌యు నాయకులు సుమన్‌, ఆనంద్‌ విలేకరులతో మాట్లాడుతూ, నవీన్‌ మృతి పై సమగ్ర విచారణ జరిపించాలని వాస్తవాలను గుర్తించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. నవీన్‌ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. మృతి చెందిన విద్యార్థి నవీన్‌ స్వగ్రామమైన జి.మాడుగుల మండలం గెమ్మెలి పంచాయితీ సుర్లపాలెం గ్రామం నుంచి నవీన్‌ తల్లిదండ్రులతో పాటు బందు వర్గం గ్రామస్తులు భారీగా తరలి వచ్చి పాఠశాల వద్ద మోహరించారు. దీంతో పోలీస్‌ అధికారులు, సిబ్బంది కూడా పాఠశాల వద్ద ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉండి ఉద్రిక్తత అదుపు తప్పకుండా చర్యలు తీసుకున్నారు.
నవీన్‌ తండ్రి మహేంద్ర విలేకరులతో మాట్లాడుతూ, తమ కుమారుడును గతేడాది ఈ పాఠశాలలో ఆరవ తరగతిలో చేర్చామని తెలిపారు. రెండు రోజులు సెలవు రావడంతో గత శుక్రవారం ఇంటికి వచ్చి మళ్లీ మంగళవారం పాఠశాలకు వచ్చేసాడని తెలిపారు. బుధవారం సాయంత్రం మృతి చెందినట్లు తమకు సమాచారం వచ్చిందని తెలిపారు. తమ కుమారుడిది హత్యేనని తాము భావిస్తున్నామని ప్రభుత్వం నిజాలను గుర్తించి తమకు అన్ని విధాల న్యాయం చేయాలని కోరారు.
విచారణ చేయాలి : సురేంద్ర
ముంచింగిపుట్టు: అనుమానాస్పదంగా మృతి చెందిన విద్యార్థి నవీన్‌పై ప్రభుత్వం సమగ్ర విచారణ జరపాలని గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కిల్లో సురేంద్ర డిమాండ్‌ చేశారు. మండల కేంద్రంలోని గిరిజన సంఘం మండల కార్యాలయం వద్ద సురేంద్ర మాట్లాడుతూ, హత్యకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, చట్టరీత్యా కేసులు పెట్టి అరెస్టు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. బాధిత కుటుంబానికి పది లక్షల ఎక్స్‌గ్రేషియా మంజూరు చేసి, ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలన్నారు. గత 6 నెలల్లో 13 మంది విద్యార్థులు మృతి చెందితే ఐటీడీఏ, జిల్లా అధికారులు కనీసం స్పందన లేక పోవడంపై మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం మండల కార్యదర్శి ఎం ఎం శ్రీను, వంతల లైకోన్‌, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కమిటీ సభ్యుడు డోంబ్రు పాల్గొన్నారు.
పరిహారం ఇవ్వాలి: పృద్విరాజ్‌
పెదబయలు : పాంగి నవీన్‌ మృతిపై సమగ్ర దర్యాప్తు చేసి కఠినంగా శిక్షించి బాధిత కుటుంబానికి 10 లక్షల ఎక్సిగ్రేషియా, ఉద్యోగం ఇవ్వాలని గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి పృధ్విరాజ్‌ డిమాండ్‌ చేశారు. ఈ ఘటనతో అధికారులు తలవంచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. నవీన్‌ కనిపించకపోతే పాఠశాల ప్రధానోపాధ్యాయులు, వార్డెన్‌లు తల్లిదండ్రులకు తెలియ పరచకపోవడం దారుణమన్నారు. గిరిజన విద్యార్థుల పట్ల నిర్లక్ష్యం వహించడం సరైన విధానం కాదని అన్నారు. ఇప్పటికైనా విద్యార్థుల భద్రత విషయంలో అధికారులు శ్రద్ధ వహించాలని డిమాండ్‌ చేశారు.