ప్రజాశక్తి-గుంటూరు జిల్లాప్రతినిధి : బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలం రాజోలు పంచాయతీ పరిధి ఉప్పలవారిపాలేనికి చెందిన పదవ తరగతి విద్యార్థి ఉప్పల అమర్‌నాథ్ (15)పై పెట్రోలు పోసి నిప్పంటించగా తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుడ్ని గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. అమర్‌నాథ్ స్థానిక ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. ఎప్పటిలాగే శుక్రవారం ఉదయం ట్యూషన్‌కు వెళ్లి వస్తుండగా బాలుడి స్నేహితుడు వెంకటేశ్వరరెడ్డి మరికొందరితో కలిసి అతడిపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. ఈ మేరకు అమర్‌నాథ్ ఆస్పత్రిలో పోలీసులకు వాంగ్మూలం ఇచ్చాడు. అమర్నాథ్ కుటుంబ సభ్యులను టిడిపి నగర అధ్యక్షులు డేగల ప్రభాకర్, నాయకులు సిహెచ్.చిట్టిబాబు, కె.శ్రీనివాస్, వి.శ్రీనివాస్ తదితరులు పరామర్శించారు. ఆస్పత్రిలో పోస్టుమార్టం అనంతరం అమరనాథ్ మృతదేహాన్ని చెరుకుపల్లికి పంపేందుకు పోలీసులు ఏర్పాట్లు చేస్తుండగా శుక్రవారం రాత్రి బిసి సంఘాల నాయకులు అడ్డుకున్నారు. బాధిత కుటుంబానికి పరిహారం, నిందితుల అరెస్టుపై ప్రకటనేమీ చేయకుండా మృతదేహాన్ని తరలించడానికి వీలులేదని రోడ్డుపై బైఠాయించారు. దీంతో పోలీసులకు, నాయకులకు మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో మృతదేహాన్ని తరలించకుండా శవాగారంలోనే ఉంచారు. బిసి సంఘాల నాయకులు టి.నరసింహారావు, జె.శ్రీనివాసరావు, టి.శ్రీనివాసరావు మాట్లాడుతూ నిందితులపై వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు.










