* జాయింట్ కలెక్టర్ ఎం.నవీన్
ప్రజాశక్తి - శ్రీకాకుళం: విద్యార్థి దశలోనే నాయకత్వ లక్షణాలను అలవరుచుకోవాలని జాయింట్ కలెక్టర్ ఎం.నవీన్ అన్నారు. నగరంలోని బాపూజీ కళామందిర్‌లో గురువారం క్యాంపస్ కాప్స్ రెండో విడత శిక్షణా తరగతుల ముగింపు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. క్యాంపస్ కాప్స్ శిక్షణలో నేర్చుకున్న చట్టాలు, నాయకత్వ లక్షణాలు, సైబర్ నేరాల నియంత్రణ తదితర అంశాలను మరో పది మందితో పంచుకోవాలని సూచించారు. చదువుతోపాటు విద్యార్థులకు సమయపాలన, స్కిల్ డెవలప్‌మెంట్, నాయకత్వ లక్షణాలు ఉన్నప్పుడు ఉన్నతమైన పౌరులుగా రూపుదిద్దుకుంటారని తెలిపారు. విద్యార్థులు సమయాన్ని వృథా చేయకుండా లక్ష్యాలను సాధించేందుకు కృషి చేయాలన్నారు. క్యాంపస్ కాప్స్ పోలీసింగ్ విధానం నేటి విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. సైబర్ నేరాలు పెరుగుతున్న ప్రస్తుత తరుణంలో ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. అదనపు ఎస్‌పి టి.పి విఠలేశ్వర్ మాట్లాడుతూ శిక్షణలో నేర్చుకున్న విషయాలు జీవితంలో చాలా ఉపయోగపడతాయని తెలిపారు. ప్రస్తుత కాలంలో యువతకు చట్టాలపై అవగాహన అవసరమన్నారు. ప్రతిఒక్కరూ ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటిస్తూ ప్రమాద రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం జెసికి ఎఎస్‌పి జ్ఞాపికను అందజేసి సత్కరించారు. కార్యక్రమంలో డిఎస్‌పి వై.శ్రుతి, ఎల్.సన్యాసినాయడు, ఎస్‌ఐలు గణేష్, లక్ష్మణరావు, విద్యార్థులు పాల్గొన్నారు.










