
ప్రజాశక్తి-అనకాపల్లి
విద్యార్థి దశ నుంచే సామాజిక స్ఫృహ కలిగి ఉండాలని చిల్డ్రన్ క్లబ్ రాష్ట్ర కన్వీనర్ రమాప్రభ అన్నారు. చిల్డ్రన్స్ క్లబ్ అనకాపల్లి ఆధ్వర్యంలో ఆసరా చారిటబుల్ సొసైటీ సహకారంతో సమ్మర్ క్యాంపు 2023 కార్యక్రమం స్థానిక దొడ్డి రామునాయుడు భవనంలో శనివారం జరిగింది. పిల్లలు, పెద్దలతో కలిసి చాలా ఉత్సాహపూరితంగా జరిగినది. చిల్డ్రన్స్ క్లబ్ జిల్లా కన్వీనర్ ఎస్ అరుణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో రమాప్రభ మాట్లాడుతూ నేడు బాలబాలికలు టీవీ, మొబైల్ ఫోన్లతో కాలం గడుపుతూ యాంత్రికంగా తయారవుతున్నారని తెలిపారు. ఒంటరిగా ఉంటూ నేను, నా చదువు, నా అభివృద్ధి అని మాత్రమే ఆలోచిస్తూ సామాజిక స్ఫృహను కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. శారీరక దఢత్వాన్ని పెంచుకుంటూ ఆరోగ్య పూరిత వాతావరణంలో పదిమందితో కలిసి ఆటపాటల కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొంటూ ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జన విజ్ఞాన వేదిక రాష్ట్ర నాయకులు వర్మ, ప్రజారోగ్య వేదిక అనకాపల్లి కన్వీనర్ మల్ల చంద్రశేఖర్, జన విజ్ఞాన వేదిక నాయకులు బి.ఉమామహేశ్వరరావు, ఐద్వా నాయకులు బి.ప్రభావతి పాల్గొన్నారు.