ప్రజాశక్తి - మార్టూరు రూరల్
తెలుగు భాషా దినోత్సవం, గిడుగు రామ్మూర్తి జయంతి సందర్బంగా పేద విద్యార్థికి రోటరీ క్లబ్ సభ్యులు ఆపన్న హస్తం అందించారు. మార్టూరు శ్రీ శ్రీనివాస హైస్కూల్‌లో 10వ తరగతి చదువుతున్న చిమ్మిరిబండ గ్రామానికి చెందిన దుడ్డు ప్రేమ్ చంద్ తండ్రి చనిపోవడంతో చదివించలేని పరిస్థితిలో ఉన్నారు. అదే స్కూల్‌లో తెలుగు దినోత్సవం వేడుకలు జరపడానికి వచ్చిన రోటరీ అధ్యక్షలు తాళ్లూరి సాంబశివరావు, అయన కుమారులు తాళ్లూరి శాంతేశ్వర ధర్మతేజ, వెంకట శివ భరత్ విద్యార్థి పరిస్థితి చూసి చలించి అక్కడికక్కడే విద్యార్థి ఫీజుకు అవసరమైన రూ.23వేలు చెక్కు రూపంలో పాఠశాల యాజమాన్యానికి అందజేశారు. ఆ విద్యార్థి ఎంత వరకు చదువుకుంటే ఆ మొత్తం ఖర్చుని తామే భరిస్తామని తెలిపారు. రోటరీ సభ్యులు, పాఠశాల యాజమాన్యం తాళ్లూరి సాంబశివరావును అయన కుమారులను అభినందించారు. అనంతరం విద్యార్దుల మధ్య గిడుగు రామ్మూర్తి జయంతి నిర్వహించారు.










