Sep 05,2023 23:25
సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే కోన రఘుపతి

       ప్రజాశక్తి-బాపట్ల: విద్యా రంగంలో వినూత్న విప్లవానికి ప్రభుత్వం నాంది పలికిందని బాపట్ల శాసనసభ్యులు కోన రఘుపతి అన్నారు. మంగళవారం జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో బాపట్ల ఎమ్మెస్సార్‌ కల్యాణ మండపంలో ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమానకి హాజరైన కోన అధ్యక్షోపన్యాసం చేశారు. రఘుపతి మాట్లాడుతూ మానవ జీవన వికాసానికి మార్గదర్శకులు ఉపాధ్యాయులేనన్నారు. విద్యాభివృద్ధికి ముఖ్యమంత్రి కన్న కలలను సార్ధకం చేసే బృహత్తర బాధ్యత ఉపాధ్యాయుల భుజస్కందాలపై ఉందన్నారు. విద్యా రంగంలో అనేక మార్పులతో జాతీయ స్థాయి విద్యను అందించాలని, మునుపెన్నడూ లేని విధంగా విద్యా విధానంలో సమూల మార్పులు చేసినట్లు తెలిపారు. ముఖ్యమంత్రి ఆలోచనలకు అనుగుణంగా నేటి ఉపాధ్యాయులు విద్యార్థులను తీర్చిదిద్దాలన్నారు. జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ చామకూరి శ్రీధర్‌ మాట్లాడుతూ సమాజంలో ఉపాధ్యాయ వృత్తి ఎంతో ఉన్నతమైనదన్నారు. ఏ రంగంలో రాణిస్తున్నా అందుకు చదువుల్లో గురువులు వేసిన పునాదులే కారణమన్నారు. సమాజానికి ఉపాధ్యాయులందిస్తున్న సేవ వెలకట్టలేనిదన్నారు. ఈ సందర్భంగా ఆయనకు విద్యాబుద్ధులు నేర్పించిన గురువులను జెసి గుర్తు చేసుకున్నారు.
డీఈఓ రామారావు మాట్లాడుతూ సమాజంలో అమ్మానాన్నల తర్వాత స్థానం గురువులకు ఇచ్చారన్నారు. లోకంలో ఎలా నడుచుకోవాలో నేర్పి, విద్యా బుద్ధులు అందించే ఉపాధ్యాయుడు మూడో గురువు అన్నారు. ఉన్నతమైన ఉపాధ్యాయ వృత్తికి వన్నె తెచ్చి, గురువు జాతి గౌరవాన్ని లోకానికి చాటిచెప్పిన భారత రెండో రాష్ట్రపతి, మేధావి, విద్యావేత్త డాక్టర్‌ సర్వేపల్లి రాధాకృష్ణన్‌ జయంతిని ప్రభుత్వం ఉపాధ్యాయ దినోత్సవంగా గుర్తించిందన్నారు. ప్రతి యేటా సెప్టెంబర్‌ 5న గురువులను గౌరవించుకునే అవకాశాన్ని కల్పించిందన్నారు. అనంతరం జిల్లాలో ఎంపిక చేసిన 14 మంది ఉపాధ్యాయులను, అలాగే సెంటా సంస్థ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా జరిగిన రాత పరీక్షలో జిల్లా స్థాయి విజేతలు 5 మంది, మొత్తంగా 19 మంది ఉపాధ్యాయులకు ప్రశంసాపత్రం, మెమొంటోలు అందజేసి దుశ్శాలువలతో సత్కరించారు. తొలుత సర్వేపల్లి రాధాకృష్ణన్‌ చిత్రపటానికి పూలమాలవేసి నివాళి అర్పించారు. కార్యక్రమంలో ఉపవిద్యాశాఖాధికారులు ఆర్‌ శ్రీనివాసరావు, వెంకటేశ్వర్లు, జిల్లా సైన్స్‌ అధికారి సాదిక్‌ మహమ్మద్‌, మండల విద్యా శాఖ అధికారులు ఎస్‌ నిరంజన్‌, ప్రసాద్‌, పలు మండలాల ఎంఈఓలు ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
బాపట్ల రూరల్‌:
ఉపాధ్యాయులు సమాజానికి మార్గదర్శకులు అని బాపట్ల మండలం చుండూరుపల్లి గ్రామ సర్పంచ్‌ గోరిజవోలు వంశీకృష్ణ అన్నారు. మంగళవారం గురుపూజోత్సవం సందర్భంగా గ్రామంలోని ఎంపీపీ పాఠశాలలో ఏర్పాటు చేసిన సర్వేపల్లి రాధాకృష్ణన్‌ చిత్రపటానికి సర్పంచ్‌ పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గురువులు భావి భారత పౌరులను తీర్చిదిద్ది సమాజానికి బహుమానంగా అందిస్తారన్నారు. కావున ప్రతి ఒక్కరూ గురువులను గౌరవంగా భావించి వారికి ప్రేమ అభిమానాలు అందించాలని కోరారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు ఏవి నారాయణను శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో అంగన్‌వాడీ కార్యకర్తలు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
బాపట్ల మండల పరిధిలోని నరసాయపాలెం గ్రామంలోని పమిడి అంకమ్మ బిఆర్‌ అంబేద్కర్‌ గురుకుల పాఠశాలలో మంగళవారం టీచర్స్‌ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. పాఠశాల ప్రిన్సిపాల్‌ వినీత ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా పదో తరగతి పరీక్షల్లో 100 శాతం ఉత్తీర్ణత సాధించిన ఉపాధ్యాయులు సరళ, ఆనంద కుమారిలకు జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ప్రకటించిన ప్రశంసాపత్రాలను ప్రిన్సిపాల్‌ వినీత అందించారు. అనంతరం మిఠాయిలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.