ప్రజాశక్తి - వినుకొండ : పల్నాడు జిల్లా విద్యారంగంలో వెనుకబడి ఉందని, రాష్ట్రవ్యాప్తంగా అక్షరాస్యత శాతం 70గా ఉంటే పల్నాడు జిల్లాలో కేవలం 54 శాతమే ఉందని ఎమ్మెల్సీ కెఎస్.లక్ష్మణరావు ఆవేదన వెలిబుచ్చారు. నియోజకవర్గంలో ట్రిపుల్ ఐటి సీట్లు సాధించిన విద్యార్థులకు, ప్రమోషన్లు పొందిన ఉపాధ్యాయులకు యుటిఎఫ్ ఆధ్వర్యంలో అభినందన సభ ఆదివారం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన కెఎస్ లక్ష్మణరావు మాట్లాడుతూ పల్నాడు జిల్లాలోని పాఠశాలల్లో పిల్లలు పెద్ద ఎత్తున చేరుతున్నా ఉపాధ్యాయుల కొరత చాలా ఎక్కువగా ఉందన్నారు. ఈ సమస్యను అధిగమించి నాణ్యమైన విద్యనందించాలని ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్రంలో ట్రిపుల్ ఐటీలు నూజివీడు, ఇడుపులపాయ, ఒంగోలు, శ్రీకాకుళం నాలుగు చోట్ల ఉన్నాయని, వినుకొండ నియోజకవర్గంలో 26 మంది సీట్లు సాధించడం అభినందనీయమన్నారు. వీరికి ఆరేళ్లపాటు ఉచిత విద్య, అనంతరం క్యాంపస్ ఇంటర్వ్యూల ద్వారా ఉద్యోగాలు పొందే అవకాశం ఉందని చెప్పారు. విద్యార్థులకు కేవీఆర్ - జయలక్ష్మి ఎడ్యుకేషనల్ సొసైటీ ట్రస్ట్ ద్వారా ఒక్కొక్కరికి రూ.వెయ్యి చొప్పున ప్రోత్సాహకాలను అందించి అభినందించారు. కార్యక్రమంలో యుటిఎఫ్ రాష్ట్ర కౌన్సిలర్లు జి.నాగరాజు, ఎం.పోలయ్య, జిల్లా కార్యదర్శి ఎం.రవిబాబు, ఆర్.అజరు కుమార్, సీనియర్ నాయకులు ఎ.నాగేశ్వరరావు, జి.నాగేం ద్రుడు, ఇ.వెంకటరెడ్డి, సాంబశివరావు, పి.రవిబాబు, హనుమంత సూరి, పిఎ జిలాని, తిరుపతిరెడ్డి పాల్గొన్నారు.
2023 డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలి
రాష్ట్ర ప్రభుత్వం వెంటనే 2023 డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలని ఎమ్మెల్సీ కెఎస్.లక్ష్మణరావు డిమాండ్ చేశారు. ఆదివారం వినుకొండకు వచ్చిన ఆయన స్థానిక స్థానిక యుటిఎఫ్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. సీఎం జగన్మోహన్‌రెడ్డి అధికారంలోకి రాకముందు పాదయాత్ర సందర్భంగా ప్రతి ఏటా డీఎస్సీ విడుదల చేసి నిరుద్యోగులను ఆదుకుంటానని ఇచ్చిన హామీ మరిచారని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 20 వేల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, డీఈడీ, బీఈడీ పూర్తి చేసిన నిరుద్యోగులు ఐదు లక్షల మంది డీఎస్సీ కోసం ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారని, రాష్ట్ర ప్రభుత్వం 2023 విడుదల చేసే డీఎస్సీ ఒక మెగాడీఎస్సీగా ఉండాలని అన్నారు. పల్నాడు జిల్లాలో మాచర్ల, వినుకొండ, గురజాల తదితర ప్రాంతాల్లో ఉపాధ్యాయుల కొరత తీవ్రంగా ఉందని, వినుకొండ పట్టణంలోని ప్రభుత్వ హైస్కూల్లో 800 మంది విద్యార్థులు ఉండగా పదిమంది ఉపాధ్యాయులు మాత్రమే ఉన్నారని తెలిపారు. ఉపాధ్యాయుల కొరతతో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యను ప్రభుత్వం గ్రహించి వెంటనే డిప్యూటేషన్ మీద అయినా ఉపాధ్యాయులను నియమించాలని డిమాండ్ చేశారు. 3, 4 తరగతులను హైస్కూల్లో విననం చేయటం వలన అనేక మంది పేద విద్యార్థులు డ్రాపౌట్ అయ్యారని ఆందోళన వెలిచ్చారు. తీవ్ర నష్టానికి కారణమవుతున్న జీవో 117ను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ప్లస్ టు పాఠశాలలు, జూనియర్ కళాశాలలో విద్యార్థులు మధ్యాహ్న భోజనం, పాఠ్యపుస్తకాలు లేక పడుతున్న ఇబ్బందులు వర్ణనాతీతమని, ప్రభుత్వం స్పందించి వెంటనే పుస్తకాలు ఇవ్వాలని, మధ్యాహ్న భోజనాన్ని కొనసాగించాలని లక్ష్మణరావు డిమాండ్ చేశారు.










