Apr 21,2023 22:31

ప్రజాశక్తి-వన్‌టౌన్‌ : రాష్ట్రంలో విద్యారంగ వికాసానికి జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం పెద్ద పీట వేస్తుందని రాష్ట్ర గహనిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్‌ అన్నారు. కాకరపర్తి భావనారాయణ కళాశాల 58వ వార్షికోత్సవ వేడుకలు శుక్రవారం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యఅతిథిగా హజరైన మంత్రి జోగి రమేష్‌ జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో దేశంలోనే తొలిసారిగా నూతన విద్యా విధానంలోని పలు అంశాలను అమలు చేయనున్నట్లు చెప్పారు. నాడు నేడు, అమ్మ ఒడి, విద్యా దీవెన తదితర అనేక పథకాలతో ప్రభుత్వ విద్యా సంస్థలకు నేటి అవసరాలకు ధీటుగా అధునాతన సౌకర్యాలతో తీర్చి దిద్దుతున్నట్లు చెప్పారు. ప్రతి విద్యార్థికి ఉపాధి అవకాశాలు అందించే దిశగా జగన్‌ ప్రభుత్వం నాణ్యత ప్రమాణాలు పటిష్టం చేస్తున్నట్లు చెప్పారు. కేబీఎన్‌ కళాశాల 58 సంవత్సరాల ప్రస్థానం విజయవంతంగా కొనసాగించటం ఆనందాన్ని కలిగిస్తోందని అన్నారు. కళాశాల అధ్యక్ష, కార్యదర్శులు టీ శేషయ్య, తూనికుంట్ల శ్రీనివాసులు మాట్లాడుతూ కాలానుగుణంగా వస్తున్న మార్పులు, ఆవిష్కరణలను గమనంలో ఉంచుకొని విద్యార్ధులను తీర్చిదిద్దేందుకు పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని వివరించారు. ఈ కార్యక్రమంలో కష్ణా విశ్వవిద్యాలయం రిజిష్ట్రార్‌ ఆచార్య ఎం రామిరెడ్డి, పారిశ్రామికవేత్త మద్ది రమేష్‌ తదితరులు ప్రసంగించారు. కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ వీ నారాయణరావు అధ్యక్షత వహించారు. కళాశాల సహాయ కార్యదర్శి జీవి రామారావు, కోశాధికారి అన్నం రామకష్ణారావు, వైస్‌ ప్రిన్సిపాల్స్‌ ఎం వెంకటేశ్వరరావు, పీఎల్‌ రమేష్‌ తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు విద్యార్ధులు ప్రదర్శించిన సాంస్కతికాంశాలు విద్యార్ధులను విశేషంగా అలరించాయి.