Sep 04,2023 23:16

ప్రజాశక్తి-అమలాపురం విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం ఎస్‌ఎఫ్‌ఐ చేపట్టిన విద్యార్థి సంగ్రామ సైకిల్‌ యాత్రను సోమవారం ఎంఎల్‌సి ఇళ్ల వెంకటేశ్వరరావు ప్రారంభించారు. అమలాపురం జెడ్‌పి బాలుర హైస్కూల్‌ నుంచి ఐవి జండా ఊపి సైకిల్‌ యాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యారంగ సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి అశోక్‌ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలు జూనియర్‌ డిగ్రీ కళాశాలలో ఖాళీగా ఉన్న అధ్యాపకుల పోస్టులను భర్తీ చేయాలని, పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని, అమలాపురంలో డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేయాలని, సంక్షేమ హాస్టల్స్‌ మెస్‌ ఛార్జీలు, పెండింగ్‌లో ఉన్న కాస్మెటిక్‌ ఛార్జీలు రిలీజ్‌ చేయాలని, రెగ్యులర్‌గా మెడికల్‌ క్యాంపులు నిర్వహించాలని, అధ్వాన స్థితిలో ఉన్న వసతి గృహాలు నిర్మించాలని డిమాండ్‌ చేశారు. ఉపాధ్యాయులకు బోధనేతర పనులు అప్పగించరాదని వారిపై వేదింపులను అరికట్టాలని డిమాండ్‌ చేశారు. ఈ సైకిల్‌ యాత్రలో జిల్లా కన్వీనర్‌ మదన్‌, కో కన్వీనర్లు ప్రణీత్‌ సాయి, శంకర్‌, సభ్యులు సందీప్‌, యువ, సంజన, ప్రవీణ్‌, తేజ పాల్గొన్నారు.