ప్రజాశక్తి-పార్వతీపురం : విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని, వసతి గృహాల్లో మౌలిక సదుపాయాలు మెరుగుపర్చాలని డిమాండ్ చేస్తూ ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యాన జిల్లా వ్యాప్తంగా సోమవారం నుంచి సైకిల్‌యాత్ర చేపట్టనున్నారు. విద్యారంగ ప్రైవేటీకరణ దిశగా పాలకులు చేపడుతున్న అనేక విధానాలతో ప్రభుత్వ విద్య పేదలకు అందకుండా పోతోందని, ఈ తరుణంలో జిల్లా విద్యారంగ సమస్యలపై, విద్యరంగ అభివృద్ధికై విద్యార్థి సంగ్రామ సైకిల్ యాత్ర చేపట్టనున్నట్లు ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు డి.పండు, పి.రాజశేఖర్ తెలిపారు. గాంధీ జయంతి సందర్భంగా సోమవారం పాచిపెంట మండల కేంద్రంలో ప్రారంభం కానున్న ఈ యాత్ర ఈనెల 11న పార్వతీపురం లో ముగియనుంది. సంక్షేమ హాస్టలకు బకాయిలుగా నిలిచిన మెస్ (డైట్ ) బిల్లులు వెంటనే విడు దల చేయాలని, పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్ బిల్లులు పెంచాలని, ఉపాధ్యాయులపై యాప్ ల భారం తొలగించాలని, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పాఠ్యపుస్తకాలు పంపిణీ చేయాలని, మధ్యాహ్న భోజనం పథకం అమలు చేయాలని, డిగ్రీలో తీసుకువచ్చిన హానర్స్ - మైనర్ సబ్జెక్టు విధానాన్ని రద్దు చేయాలని, డిగ్రీ విద్యార్థులు ఇంటర్న్ షిప్‌లో ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నా రు. ప్రధానంగా ఎన్‌ఇపి రద్దు చేయాలని, పాఠశాలల విలీనం ఆపాలని, ఖాళీగా ఉన్న అధ్యాపక, ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని, హాస్టళ్లలో పర్మినెంట్ వర్కర్లను, వార్డెన్లను నియమించాలని, పోస్టుమెట్రిక్ హాస్టలకు సొంత భవనాలు ఏర్పాటు చేయాలని, పాాచిపెంటలో డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని, సాలూరు పోస్టుమెట్రిక్ కాలేజీ బార్సు హాస్టల్‌కు రోడ్డు సౌకర్యం కల్పించాలని, మండల కేంద్రంలో ఆశ్రమ పాఠశాల నిర్మించాలని, మక్కువలో పోస్టుమట్రిక్ హాస్టలను నిర్మించాలని, సీతానగరంలో పోస్ట్ మేట్రిక్ హాస్టలను నిర్మించాలని, మండల కేంద్రంలో డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. పాలకొండ గిరిజన పోస్ట్ మెట్రిక్ కాలేజీ బార్సు హాస్టలుకు సొంత భవనం నిర్మించాలని, నియోజకవర్గ కేంద్రంలో పీజీ సెంటర్ ఏర్పాటు చేయాలని, సీతంపేటలో జూనియర్ కళాశాల ఏర్పాటు చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ డిమాండ్ చేస్తోంది. గుమ్మలక్ష్మిపురం పోస్టుమేట్రిక్ హాస్టలుకు అదనపు భవనం ఏర్పాటు చేయాలని, కురుపాంలో సొంత భవనం ఏర్పాటు చేయాలని, మౌలిక వసతులు కల్పించాలని కోరుతున్నారు. పార్వతీపురం గిరిజన పోస్టుమెట్రిక్ హాస్టలకు అదనపు భవనాలు నిర్మించాలని, ఎస్‌సి, బిసి పోస్టుమెట్రిక్ హాస్టళ్లకు సొంత భవనాలు నిర్మించాలని డిమాండ్ చేస్తున్నారు. డిగ్రీ కళాశాలలో పని చేస్తున్న అధ్యాపకులను రెగ్యులర్ చేయాలని, మెడికల్ కళాశాల పనులు ప్రారంభించాలని, ఐటిఐ కళాశాల ఏర్పాటు చేయాలని మరియు తదితర డిమాండ్ల పరిష్కారానికి ఈ యాత్ర చేపడుతున్నారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు, మేధావులు, అభ్యుదయ వాదులు పాల్గొని జయప్రదం చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు విజ్ఞప్తి చేశారు.
సైకిల్ యాత్రను జయప్రదం చేయండి
గుమ్మలక్ష్మీపురం : విద్యారంగంలో ఉన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈనెల 2 నుంచి ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో చేపట్టబోయే సైకిల్ యాత్ర జయప్రదం చేయాలని కోరుతూ గుమ్మలక్ష్మీపురంలో ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు గోడ పత్రికలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ మండల అధ్యక్షులు ఎ.గంగారావు మాట్లాడుతూ అక్టోబర్ 2న పాచిపెంటలో సైకిల్ యాత్ర ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. వసతి గృహాల మెస్ బిల్లులు బకాయిలు వెంటనే విడుదల చేయాలని, పెరిగిన ధరలకు అనుగుణంగా విద్యార్థుల మెస్ ఛార్జీలు పెంచాలని అన్నారు. జిఒ 117 రద్దుచేసి పాఠశాలల విలీనం ఆపాలని, ఖాళీగా ఉన్న అధ్యాపకుల పోస్టులను భర్తీ చేయాలని, వసతి గహాల్లో సిబ్బందిని నియమించాలని, పోస్ట్ మెట్రిక్ హాస్టళ్లకు సొంత భవనాలు నిర్మించాలని సమస్యలపై సైకిల్ యాత్ర నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మండల కమిటీ సభ్యులు బి అనిల్, ఎ సురేష్, రవి ఉన్నారు.










