Aug 02,2022 00:18

అనకాపల్లి ఆర్‌డిఒ కార్యాలయం వద్ద ధర్నా చేస్తున్న విద్యార్థులు

  ప్రజాశక్తి-యంత్రాంగం : పాఠశాలల విలీనాన్ని వ్యతిరేకిస్తూ, విద్యారంగ సమస్యలను పరిష్కరించాలంటూ సోమవారం విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో ఆందోళనలకు దిగిన ఎస్‌ఎఫ్‌ఐ నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. విశాఖలో తీవ్ర నిర్బంధం ప్రయోగించారు. ముందస్తు అరెస్టులకు దిగడమేకాక ఇద్దరు నాయకులపై సిఐ దాడి చేశారు. వారిలో ఒకరికి శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారింది. అనకాపల్లిలో పోలీసుల నిర్బంధాన్ని అధిగమించి విద్యార్థులు ఆర్‌డిఒ కార్యాలయ ముట్టడిని జయప్రదం చేశారు. పోలీసుల తీరును పలువురు ఖండించారు
అనకాపల్లి : అనకాపల్లిలో ఆర్‌డిఒ కార్యాలయాన్ని ఎస్‌ఎఫ్‌ఐ ఆద్వర్యాన ముట్టడించారు. విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని విద్యార్థులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి తొమ్మిది మందిని అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు. అనంతరం వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షులు ఎస్‌.రమణ, మండల కార్యదర్శి తరుణ్‌ తదితరులు మాట్లాడారు. పెండింగ్‌లో ఉన్న విద్యా, వసతి దీవెన బకాయిలు తక్షణమే చెల్లించాలని, పాఠశాలల విలీనం చేసే 117 జీవో రద్దుచేయాలని, మండల డివిజన్‌ కేంద్రాల్లో ప్రభుత్వ జూనియర్‌ డిగ్రీ కళాశాలను ఏర్పాటుచేయాలని డిమాండ్‌ చేశారు. నిత్యవసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిన నేపథ్యంలో నాణ్యమైన భోజనం హాస్టళ్లలో పెట్టడంలేదని, ఈ నేపథ్యంలో మెస్‌, కాస్మటిక్‌ చార్జీలు పెంచాలని డిమాండ్‌ చేశారు. అనంతరం ఆర్డీవో కార్యాలయ ఎఒ గంగాధర్‌కు వినతిపత్రం అందజేశారు. అరెస్టు అయిన వారిలో జిల్లా అధ్యక్షులు ఎస్‌.రమణ, మండల కార్యదర్శి తరుణ్‌, పి.తనోజ్‌, రాకేష్‌, స్వాతి, మౌనిక, సంధ్య, హరిణి, నాయుడు ఉన్నారు.
విశాఖలో ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు ఎన్‌.అజరును, డివైఎఫ్‌ఐ నాయకుడు సురేష్‌ను ముందుస్తుగానే అరెస్టుచేసి స్టేషన్‌లో నిర్బంధించారు. వారి నుంచి సెల్‌ఫోన్లు లాక్కొన్నారు. బాత్‌రూమ్‌లకు వెళ్లనివ్వలేదు. మంచినీరు ఇవ్వలేదు. ఇదెక్కడ న్యాయమంటే దుర్భాషలాడి స్టేషన్‌లోనే ఎన్‌.అజరుపై సిఐ దాడి చేశారు. ఇది సరికాదు అంటే సురేష్‌ను కూడా కొట్టారు.
సిఐపై చర్యలకు సిపిఎం, సిఐటియు డిమాండ్‌
పోలీస్‌స్టేషన్‌లో అన్యాయంగా దాడిచేసిన సిఐపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సిపిఎం విశాఖ జిల్లా కార్యదర్శి ఎం.జగ్గునాయుడు డిమాండ్‌చేశారు. తమ సమస్యలపై విద్యార్థులు నిరసన తెలపకూడదా అని ప్రశ్నించారు. ముందుగా అరెస్టులు చేయడమే కాక దుర్భాషలాడి దాడి చేయడం హేయమైన చర్య అని పేర్కొన్నారు.
ఎస్‌ఎఫ్‌ఐ డివైఎఫ్‌ఐ జిల్లా నాయకులపై కంచరపాలెం సిఐ కృష్ణారావు చేయి చేసుకోవడంపై సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్‌కెఎస్‌వి కుమార్‌ తీవ్రంగా ఖండించారు. సిఐపై కఠిన చర్యలు తీసుకోవాలని పైఅధికారులను డిమాండ్‌ చేశారు. నిరసనలు తెలియజేయకుండా అడ్డుకోవడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని పేర్కొన్నారు. ప్రజా సంఘాల నాయకులను ముందస్తు అరెస్టులు నిలిపివేయాలని, నాయకులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు.
సిఐని సస్పెండ్‌ చేయాలంటూ ధర్నా
కంచరపాలెం : విద్యార్థి, యువజన సంఘాల నాయకులపై అకారణంగా దాడి చేసిన కంచరపాలెం సిఐని వెంటనే సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేస్తూ ఎస్‌ఎఫ్‌ఐ, డివైఎఫ్‌ఐ, సిఐటియు, ఐద్వా, ప్రజా సంఘాల ఆధ్వర్యాన సోమవారం కంచరపాలెంలోని ఐదో పట్టణ పోలీస్‌ స్టేషన్‌ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజాసంఘాల నాయకులు మాట్లాడుతూ, పోలీసులు తమ అధికారాలను దుర్వినియోగం చేస్తున్నారన్నారు. ప్రజా సమస్యలపై నిరసన తెలిపే హక్కు ప్రజలకు, ప్రజా సంఘాలకు ఉంటుందని పేర్కొన్నారు. రాజ్యాంగ హక్కును కాపాడాల్సిన బాధ్యత పోలీసులపై ఉందన్నారు. ముందస్తు అరెస్టులు చేసిన వారిని గాయాలయ్యేలా కొట్టాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. నిర్బంధాలతో ఉద్యమాలను అణిచివేసే చర్యల్ని అందరూ వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. రౌడీలా వ్యవహరించిన సిఐని వెంటనే సస్పెండ్‌ డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ అధ్యక్ష, కార్యదర్శులు కుసుమ, నాయుడు, డివైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి యుఎస్‌ఎన్‌.రాజు, ఉపాధ్యక్షులు శ్రావణ్‌, జోన్‌ కన్వీనర్‌ విజయ, సిఐటియు నాయకులు జగన్‌, అప్పారావు, కె.రాంబాబు, పి.మూర్తి, బి.కృష్ణ, మాజీ కార్పొరేటర్‌ బొట్టా ఈశ్వరమ్మ, ఐద్వా నాయకులు చంద్రకళ, రామలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.