Sep 03,2023 22:07

సమావేశంలో మాట్లాడుతున్న యుటిఎఫ్‌ జిల్లా అధ్యక్షులు పి.ప్రేమ్‌కుమార్‌ తదితరులు

ప్రజాశక్తి - పల్నాడు జిల్లా : ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడం, ఆ క్రమంలో ఎదురయ్యే సమస్యల పరిష్కారం కోసం సామాజిక స్పహతో పని చేయడం యుటిఎఫ్‌ లక్ష్యమని, ఆ తర్వాతే ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యమని యుటిఎఫ్‌ పల్నాడు జిల్లా అధ్యక్షులు పి.ప్రేమ్‌కుమార్‌ అన్నారు. యుటిఎఫ్‌ జిల్లా కమిటీ సమావేశం జిల్లా కేంద్రమైన నరసరావుపేటలోని కార్యాలయంలో ఆదివారం నిర్వహించారు. సమావేశానికి జిల్లా ప్రధాన కార్యదర్శి జి.విజయసారధి అధ్యక్షత వహించారు. ప్రేమ్‌కుమార్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో పాఠశాల విద్యారంగం పరిస్థితి ఆశాజనకంగా లేదని, గతేడాది రాష్ట్ర వ్యాప్తంగా 46 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యను అభ్యసించగా ఈ ఏడాది 39 లక్షలకు పడిపోయిందని ఆవేదన వెలిబుచ్చారు. ప్రభుత్వం నాడు-నేడు ద్వారా పాఠశాల్లో మౌలిక సదుపాయాలు కల్పించి అమ్మఒడి, విద్యా దీవెన, విద్యా కానుక, అంటూ పథకాలు ప్రవేశ పెట్టినా విద్యార్థులను తల్లిదండ్రులను ఆకర్షించడంలో విఫలమైందన్నారు. ఇదే సమయంలో ఉపాధ్యాయుల పట్ల ప్రభుత్వం వైఖరి ఇబ్బందికరంగా ఉందని, కక్షపూరితంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. బదిలీ ఉపాధ్యాయులకు 3 నెలలుగా క్యాడర్‌ స్ట్రెన్త్‌ అంటూ వేతనాలు ఇవ్వలేదని, రెండు దశాబ్దాల కాలంలో ఎప్పుడూ ఇటువంటి పరిస్థితి చూడలేదని అన్నారు. విద్యారంగంలో అనేక సంస్కరణలను ప్రభుత్వం తెచ్చిందని, ఆంగ్ల మాధ్యమంలో బోధించాలని ఒత్తిడి చేస్తోందని, అయితే ఉపాధ్యాయులకు శిక్షణివ్వకుండా విద్యార్థులు సమర్థవంతంగా పాఠాలు చెప్పడం ఎలా సాధ్యమని ప్రశ్నించారు. అంతర్జాతీయ ప్రమాణాలతో అంగ్ల మాధ్యమంలో విద్యాబోధన అందించాలనే రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలను ఆహ్వానిస్తున్నామని, దీనికి సంబంధించి ఉపాధ్యాయులకు తర్ఫీదు ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పారు. రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాష్‌ పల్నాడు జిల్లా పర్యటనలో భాగంగా విద్యార్థుల ముందే ఉపాధ్యాయులను దూషించారని, అవమానకరంగా మాట్లా డారని, దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. ప్రవీణ్‌ ప్రకాష్‌ తనతీరు మార్చుకోకపోతే యుటిఎఫ్‌ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరిం చారు. పని సర్దుబాటు పేరిట రాజకీయ బదిలీలు జరుగుతున్నాయని, పల్నాడు జిల్లాలో 147 మంది ఉపాధ్యాయులకు సీఎంవో పేషీ నుండి బదిలీలు జరిగాయని, ఆ 147 మంది ఉపాధ్యా యులను పల్నాడులో పని చేయాలని చెప్పాల్సిన మంత్రులు, ఎమ్మెల్యేలు ఇష్టారీతిగా గుంటూరు, విజయవాడ వంటి ప్రాంతాలకు బదిలీ చేయడం వలన పల్నాడు విద్యారంగానికి నష్టం జరుగుతోందని వివరించారు. పల్నాడు జిల్లాలో రెండున్నర దశాబ్దాలుగా ఉపాధ్యా యుల కొరత ఉందని, ప్రభుత్వం ఇప్పటికైనా భర్తీ చేయాలని డిమాండ్‌ చేశారు. ఇటీవల జరిగిన బదిలీలలో పల్నాడు జిల్లాలో పూర్తిస్థాయిలో ఉపాధ్యా యులు ఉన్నారని సంతోషం వెంటనే ఆవిరి అయిపోయిందన్నారు. జెడ్‌పి పాఠశాలల్లో సబ్జెక్టు టీచర్ల కొరత ఉందన్నారు. జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు ఈ జిల్లా నుండి మరో జిల్లాకు బదిలీ చేయడం విద్యార్థి పట్ల సమాజం పట్ల ఉన్న బాధ్యత తేటతెల్లం అవుతుందన్నారు. ఉపాధ్యాయుల అక్రమ బదిలీలు నిలిపివేయాలని, ఖాళీలను భర్తీ చేసేందుకు ప్రజాప్రతినిధులు ప్రయత్నం చేయాలని కోరారు. ఈ నెల 9న యుటిఎఫ్‌ రాష్ట్ర జాత నెల్లూరు, ఒంగోలు నుండి పల్నాడు జిల్లాలో ప్రవేశిస్తుందని ప్రచార జాతాకు స్వాగతం పలికి జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.
విజయసారధి మాట్లాడుతూ జిపిఎస్‌ను యుటిఎఫ్‌ అంగీకరించదని, పాత పెన్షన్‌ విధానం అమలు చేయాల్సి ందేనని స్పష్టం చేశారు. సిపిఎస్‌కు బదులుగా జిపిఎస్‌ విధానాన్ని అమలుకు ఇటీవల రాష్ట్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయం రాష్ట్రంలోని 13 లక్షల మంది ఉద్యోగ ఉపాధ్యాయుల ఆశలను నీరుగార్చిందన్నారు. సిఎం ఇచ్చిన హామీ అమలు కాకపోవడం అత్యంత బాధాక రమన్నారు. సిపిఎస్‌ రద్దుపై నాలుగే ఏళ్లు కాలయాపన చేసి ఇప్పుడు కంటి తుడుపు చర్యగా జిపిఎస్‌ విధానాన్ని అమలు చేస్తామండడం ఉద్యోగ, ఉపాధ్యాయులు మరోసారి వంచిచడమేనన్నారు. జిపి ఎస్‌లో ఉద్యోగుల కాంట్రిబ్యూషన్‌ ఉందని, షేర్‌ మార్కెట్‌ లాభనష్టాలతో ఉద్యోగుల పెన్షన్‌ ఆధారపడి ఉంటుందని తెలిపారు. షేర్‌ మార్కెట్‌పై ఆధారపడి వచ్చే పెన్షన్‌కు సామాజిక భద్రత ఎలా ఉంటుందో ప్రభుత్వమే సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. ఉపాధ్యాయులకు ముఖ ఆదారిత హాజరు బోధనేతర పనులకు సెల్‌ఫోన్‌ ద్వారా చేయాల్సి ఉంటుందని అటువంటి పరిస్థితులలో 9.30 తర్వాత ఉపాధ్యాయులు ఫోన్‌ లేకుండా ఉండడం ఎలా ప్రశ్నించారు. బోధన, పరీక్షలకు సంబంధించి అన్ని అంశాలను ఉపాధ్యాయులతో సంప్రదించకుండానే ప్రభుత్వం ఎలా నిర్ణయిస్తుందని నిలదీశారు. సమావేశంలో యుటిఎఫ్‌ జిల్లా గౌరవాధ్యక్షులు శ్రీనివాసరెడ్డి, సహాధ్యక్షులు ఎం.మోహన్‌రావు, కోశాధికారి జెవిడి నాయక్‌ , ఎన్‌.సుందరరావు పాల్గొన్నారు.