Nov 17,2023 19:35

దీక్షలను ప్రారంభిస్తున్న ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్రకార్యదర్శి అశోక్‌

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ :  విజయనగరం జిల్లాలో పేరుకుపోయిన విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌చేస్తూ ఎస్‌ఎఫ్‌ఐ అధ్వర్యంలో శుక్రవారం కలెక్టరేట్‌ వద్ద ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యాన నిరవధిన నిరాహారదీక్షలు చేపట్టారు. దీక్షలను ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి ఎ. అశోక్‌ ప్రారంబించారు. పలు ప్రజాసంఘాల నాయకులు దీక్షలకు మద్దతు తెలిపారు. దీక్షలను ఉద్దేశించి అశోక్‌ మాట్లాడుతూ జిల్లాలో విద్యారంగ సమస్యలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగానే ఉన్నాయని తెలిపారు. జిల్లా కేంద్రంలో ఎస్‌ ఎఫ్‌ ఐ పోరాట ఫలితంగా సాధించుకున్న ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు ఇప్పటికీ సొంత భవనాలు కేటాయించని పరిస్తితి చూస్తుంటే ప్రభుత్వ చిత్తశుద్ది అర్ధమవుతోందన్నారు. ఎస్‌ఎఫ్‌ఐ కేంద్ర కమిటీ సభ్యులు సిహెచ్‌ పావని మాట్లాడుతూ ఏళ్లు గడుస్తున్నా సమస్యలు పెరుగుతున్నాయి తప్ప పరిష్కారం కావడం లేదన్నారు. ఐదేళ్ల క్రితం నిరాహార దీక్షలు చేసిన సందర్భంగా విద్యార్థినులకు శానిటరీ నాప్కిన్స్‌ పంపిణీ చేయాలని డిమాండ్‌ చేస్తే నేటి వరకు ప్రభుత్వం నెరవేర్చ లేదన్నారు. సమస్యల పరిష్కారం కాకపోతే విద్యార్థుల ఆందోళనను ప్రభుత్వం రుచి చూడక తప్పదని అన్నారు. దీక్షలకు సిఐటియు, ఐద్వా, వ్యవసాయ కార్మికసంఘం, పట్టణ పౌర సంక్షేమ సంఘం, శ్రామిక మహిళా సంఘం నాయకులు మద్దతు తెలిపారు. దీక్షలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు సిహెచ్‌ వెంకటేష్‌, పి. రామ్మోహన్‌, జిల్లా సహాయ కార్యదర్శి జె. రవి కుమార్‌, జిల్లా కమిటీ సభ్యులు పి. రమేష్‌, కె. రమేష్‌, ఎస్‌.సమీరా, నాయకులు వి.భారతి, కె. డేవిడ్‌ ఉన్నారు. దీక్షకు సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు టి. సూర్యనారాయణ, కెవిపి ఎస్‌ జిల్లా కార్యదర్శి ఆనంద్‌ మద్దతు తెలిపారు. అధిక సంఖ్యలో విద్యార్థులు దీక్షా శిబిరం వద్దకు చేరుకుని మద్దతు తెలిపారు.