Nov 18,2023 21:54

చలో కలెక్టరేట్‌ వాల్‌పోస్టర్‌ను విడుదల చేస్తున్న ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు

ప్రజాశక్తి - బలిజిపేట :   జిల్లాలో విద్యా రంగ సమస్యలపై ఈనెల 30న చలో కలెక్టరేట్‌ నిర్వహించనున్నట్టు ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి పి.రాజశేఖర్‌ తెలిపారు. ఈ మేరకు శనివారం స్థానిక పిఎస్‌ఎన్‌ కళాశాలలో ధర్నాకు సంబంధించిన గోడపత్రికను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గిరిజన, పేద, మధ్యతరగతి యువతకు, విద్యార్థులకు మెరుగైన విద్య, ఉపాధి అవకాశాలు కరువయ్యాయని వాపోయారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా సుమారు 70వేల మంది విద్యార్థులు జిల్లాలో ఉన్నత చదువుల నిమిత్తం విద్యాసంస్థల్లేకపోవడం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు. నూతన విద్యా విధానాన్ని దేశంలో ఏ రాష్ట్రంలోనూ అమలు చేయలేదని, ఒక్క మన రాష్ట్ర ప్రభుత్వమే వేగంగా అమలు చేయడం దౌర్భాగ్యమని అన్నారు. రాష్ట్ర విభజన సమయంలో జిల్లాకు మెడికల్‌, ఇంజనీరింగ్‌, యూనివర్సిటీలను నిర్మాణం చేపడతామని హామీ ఇచ్చిన మోడీ, జగన్‌ నాలుగున్నరేళ్లుగా శంకుస్థాపనలతో కాలక్షేపం చేపడుతున్నా జిల్లా మంత్రులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవడంలేదని విమర్శించారు. ప్రజల వద్దనే పాలననే ప్రభుత్వానికి ప్రజల చెంతన విద్యాసంస్థలు నెలకొల్పవడం పాలకులకు పట్టదా అని ప్రశ్నించారు. జిల్లాలో విద్యారంగ సమస్యల పరిష్కారానికి ఎస్‌ఎఫ్‌ఐ సైకిల్‌ యాత్ర, ఈనెల 8 రాష్ట్రవ్యాప్తంగా బంద్‌ చేపట్టిందని, అయినా రాష్ట్ర ప్రభుత్వ వైఖరిలో ఎలాంటి చలనం లేదన్నారు. అందుకే ఈనెల 24 నుంచి 29 వరకు పార్వతీపురం ఆర్టీసీ కాంప్లెక్స్‌ వద్ద నిరసన దీక్షలు, 30న చలో కలెక్టరేట్‌ చేపడుతున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యార్థిని, విద్యార్థులు పెద్ద ఎత్తున భాగస్వాములై జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు మహేష్‌, శ్రీశాంత్‌, వెంకటలక్ష్మి, సంధ్య, సుకన్య తదితరులు పాల్గొన్నారు.