May 20,2023 19:38

మాట్లాడుతున్న నాగమణి

ప్రజాశక్తి - గోనెగండ్ల
ప్రభుత్వ పాఠశాలల పరిరక్షణకు కృషి చేస్తూ, విద్యారంగం పరిరక్షణకు కృషి చేస్తామని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి ఎస్‌.అబ్దుల్లా తెలిపారు. శనివారం స్థానిక మోడల్‌ స్కూల్‌లో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షులు రంగప్ప ఆధ్వర్యంలో విద్యా వైజ్ఞానిక శిక్షణ తరగతులను ప్రారంభించారు. శిక్షణ తరగతుల్లో మాస్టర్‌గా యుటిఎఫ్‌ జిల్లా అధ్యక్షులు ఎల్లప్ప హాజరై మాట్లాడారు. నూతన జాతీయ విద్యా విధానం ద్వారా ప్రభుత్వ విద్యను కషాయీకరణం చేస్తూ ప్రభుత్వ విద్యను పేద, బడుగు, బలహీన వర్గాలకు దూరం చేసి ప్రయివేట్‌ విద్యాసంస్థలకు లాభం చేకూరేలా చేస్తోందని తెలిపారు. నూతన విద్యావిధానం పేరుతో చరిత్ర కారుల జీవిత చరిత్రను తొలగించడం, లౌకిక విధానాన్ని అమలు చేయకుండా నిరంకుశ విధానాన్ని అవలంభిస్తోందని చెప్పారు. ప్రభుత్వ పాఠశాలల విలీనం పేరుతో ప్రాథమిక విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేయడం, భవిష్యత్తులో ఉపాధ్యాయ పోస్టులు లేకుండా చేసి నిరుద్యోగులకు ఉపాధి లేకుండా చేయడం సమంజసం కాదన్నారు. ముఖ్య అతిథులుగా యుటిఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి నాగమణి, ఎస్‌ఎఫ్‌ఐ మాజీ నాయకులు, కెవిపిఎస్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆనంద్‌ బాబు, జిల్లా ఉపాధక్షులు కరుణాకర్‌, ఎస్‌ఎఫ్‌ఐ మాజీ నాయకులు దండు ఖాజా, యుటిఎఫ్‌ జిల్లా కార్యదర్శి నరసింహులు, రామన్‌ పాల్గొన్నారు.