Nov 19,2023 21:11

యుటిఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షులు ఎన్‌.వెంకటేశ్వర్లు
ప్రజాశక్తి - నరసాపురం టౌన్‌
విద్యార్థులకు నాణ్యమైన విద్య అందిస్తామని, అన్ని సౌకర్యాలతో పాఠశాలలను తీర్చిదిద్దుతామని, వేల కోట్ల రూపాయలు విద్యారంగం కోసం ఖర్చు పెడతామని చెప్పిన ప్రభుత్వం నాలుగున్నరేళ్లలో ఎంత మంది విద్యార్థులకు నాణ్యమైన విద్య అందిందో, ఎంతమంది ప్రభుత్వ ఉపాధ్యాయుల నియామకాలు జరిగాయో శ్వేతపత్రం విడుదల చేయాలని యుటిఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షులు ఎన్‌.వెంకటేశ్వర్లు డిమాండ్‌ చేశారు. పశ్చిమగోదావరి జిల్లా యుటిఎఫ్‌ 49వ కౌన్సిల్‌ సమావేశం యుటిఎఫ్‌ జిల్లా అధ్యక్షులు విజయరామరాజు అధ్యక్షతన వైఎన్‌ కళాశాలలో శుక్రవారం జరిగింది. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ఒక పాఠశాల కూడా మూసివేయలేదని, ఏ ఒక్క ఉపాధ్యాయుడినీ తొలగించలేదని ప్రభుత్వం చెబుతోందని, 4600 పాఠశాలల్లోని 3, 4, 5 తరగతులను విలీనం చేయడం వల్ల నాణ్యమైన విద్య ఎక్కడ అందిందో చెప్పాలని డిమాండ్‌ చేశారు. 14 వేల ప్రాథమిక పాఠశాలల్లో ఏకోపాధ్యాయులు ఉన్నది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. ఇక్కడ చదివే విద్యార్థులకు నాణ్యమైన విద్య అందే అవకాశం ఉందా అని ప్రభుత్వమే చెప్పాలని డిమాండ్‌ చేశారు. ప్రమోషన్లు ఇచ్చేశామని ప్రభుత్వం గొప్పగా చెబుతోందని, ప్రతి ప్రమోషన్‌కూ ఎన్ని ఎస్‌జిటి పోస్టులు రద్దు చేశారో శ్వేతపత్రం విడుదల చేయాలని కోరారు. పాఠశాలల పర్యవేక్షణ పేరుతో అధికారులు తిరగడం ద్వారా ప్రభుత్వ పాఠశాలల పట్ల తల్లిదండ్రులకు నమ్మకాన్ని పెంచిందా, తగ్గించిందా అని సమీక్షించుకోకుండా పర్యవేక్షణ పేరుతో విద్యారంగాన్ని బలహీనపర్చడం, ఉపాధ్యాయులను మానసిక వేధింపులకు గురిచేయడం సరికాదని విమర్శించారు. జిఒ 117 వల్ల పాఠశాల విద్యావ్యవస్థ అస్తవ్యస్తంగా మారిందన్నారు. ఉభయగోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్‌ ఎంఎల్‌సి ఇళ్ల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ పాలకులు కార్పొరేట్‌ సంస్థల లాభాల కోసం ఉద్యోగ, ఉపాధ్యాయుల పెన్షన్‌ రద్దు చేసిందన్నారు. పాలకులు ఉద్యోగ, ఉపాధ్యాయుల పక్షమో లేక కార్పొరేట్ల పక్షమో తేల్చుకోవాలన్నారు. సిఎం జగన్మోహన్‌రెడ్డి ప్రతిపక్షంలో ఉండగా వారంలో సిపిఎస్‌ రద్దు చేస్తానన్న హామీ నాలుగున్నరేళ్లయినా నెరవేరకపోగా సిపిఎస్‌ కంటే ఘోరమైన జిపిఎస్‌ అమలు చేస్తున్నామని ప్రభుత్వం గారడీ చేస్తోందని విమర్శించారు. చట్టం చేసినంత మాత్రాన పోరాటాలు ఆపాల్సిన అవసరం లేదని తెలిపారు. నల్ల చట్టాల రద్దుకు రైతులు చేసిన పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకుని సిపిఎస్‌, జిపిఎస్‌ రద్దుకు పోరాడాలని పిలుపునిచ్చారు. యుటిఎఫ్‌ రాష్ట్ర కోశాధికారి బి.గోపీమూర్తి మాట్లాడుతూ ఉద్యోగ, ఉపాధ్యాయులకు ప్రభుత్వం పిఆర్‌సి, డిఎ బకాయిలు చెల్లించాలని డిమాండ్‌ చేశారు. పిఎఫ్‌, ఎపిజిఎల్‌ఐ లోన్లు ఫైనల్‌ సెటిల్‌మెంట్లు క్లియర్‌ చేయాలని, 12వ పిఆర్‌సికి సంబంధించి ఇంటీరియల్‌ రిలీఫ్‌ ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. అనంతరం ఎంఎల్‌సి షేక్‌ సాబ్జీ మాట్లాడారు. సమావేశంలో యూనియన్‌ నాయకులు పొదిలి కృష్ణమూర్తి, వలవల శ్రీరామ్మూర్తి, సిఐటియు నాయకులు కె.రాజా రామ్మోహన్‌ రారు, యుటిఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి బి.శుభాషిణి, ఏలూరు జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ముస్తఫాఆలీ, ఆర్‌.రవికుమార్‌, పశ్చిమ గోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎకెవి.రామభద్రం, జిల్లా గౌరవ అధ్యక్షులు ఎం.మార్కండేయులు, సహాధ్యక్షులు కె.రాజశేఖర్‌, సహాధ్యక్షురాలు కె.శ్రీదేవి, జిల్లా కోశాధికారి సిహెచ్‌.పట్టాభిరామయ్య, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.