Aug 17,2023 00:37

పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు

ప్రజాశక్తి-కలెక్టరేట్‌ (విశాఖ) : విద్యారంగ అభివృద్ధి, సంక్షేమ హాస్టళ్లను అభివృద్ధిచేయాలని కోరుతూ భారత విద్యార్థి ఫెడరేషన్‌ (ఎస్‌ఎఫ్‌ఐ) ఆధ్వర్యాన ఈ నెల 19 నుంచి 22వ తేదీ వరకు విశాఖ జిల్లా మొత్తం సైకిల్‌ యాత్ర నిర్వహించనున్నట్లు ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి ఎల్‌జె.నాయుడు తెలిపారు. ఇందుకు సంబంధించిన పోస్టర్‌ను బుధవారం జగదాంబ సమీపంలోని సిఐటియు కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ సైకిల్‌ యాత్ర ఈ నెల 19న భీమిలిలో ప్రారంభమై 22న గాజువాకలో ముగుస్తుందన్నారు. వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విద్యారంగాన్ని నాశనం చేసే విధానాలను అవలంభిస్తోందని విమర్శించారు. పాఠశాల నుంచి యూనివర్సిటీ స్థాయి వరకు అన్ని ప్రభుత్వ విద్యా సంస్థలను తిరోగమన దిశలో నడిపిస్తోందన్నారు. విద్యారంగం ప్రయివేటీకరణకు జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం పూనుకుంటుందని విమర్శించారు. సంక్షేమ హాస్టళ్లకు సొంత భవనాలు నిర్మించాలని, నేడు - నేడు ద్వారా మరమత్తులకు నిధులు కేటాయించాలని పెరిగిన నిత్యవసర ధరలకు అనుగుణంగా మెస్‌ చార్జీలు రూ.3 వేలకు పెంచాలని, సన్న బియ్యం సరఫరా చేయాలని, జిఒ 77 రద్దుచేసి పీజీ విద్యార్థులకు విద్యా దీవెన అందించాలని, ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో పాఠ్య పుస్తకాలు, మధ్యాహ్న భోజన పథకం అమలు చేయాలని, ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ, అధ్యాపక, ప్రొఫెసర్‌ పోస్టులను భర్తీ చేయాలని, వైద్య విద్యార్థుల పాలిట శాపంగా మారిన జిఒ 107, 108 రద్దు చేయాలన్న డిమాండ్లతో ఎస్‌ఎఫ్‌ఐ విద్యార్థి సంఘర్షణ సైకిల్‌ యాత్ర నిర్వహిస్తుందన్నారు. ఈ సైకిల్‌ యాత్ర ద్వారా జిల్లాలోని అన్ని విద్యాసంస్థలను, సంక్షేమ హాస్టళ్లను, పాఠశాలలను సందర్శించి సమస్యలను గుర్తించి, పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కమిటీ సభ్యుడు టి.రాము, నాయకులు ఎం.గుణ, హర్షిత్‌, తులసీరామ్‌ పాల్గొన్నారు.