Jan 13,2023 00:31

సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్న రత్నాకర్‌ దంపతులు

ప్రజాశక్తి-అనకాపల్లి
స్థానిక డైట్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో గురువారం నిర్వహించిన సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటాయి. కళాశాల చైర్మన్‌ దాడి రత్నాకర్‌ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో భోగి మంటలు, హరిదాసు సంకీర్తనలు, తోడు పెద్దల సేవ, విద్యార్థులు వేసిన రంగురంగుల ముగ్గులు ఆకర్షించాయి. ఈ సందర్భంగా సంక్రాంతి విశిష్టతను రత్నాకర్‌ తెలియజేశారు. కళాశాల గవర్నమెంట్‌ బాడీ మెంబర్‌ దాడి అచ్యుత వివిధ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ చల్ల నర సింహం, వైస్‌ ప్రిన్సిపల్‌ డాక్టర్‌ వైకుంఠరావు, డీన్‌ అడ్మిన్‌ డాక్టర్‌ కె ఎస్‌ ఈశ్వరరావు, అధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.
గాయత్రి హైస్కూల్‌లో...
కశింకోట : మండలంలోని తాళ్ళపాలెం గాయత్రి ప్రైమరీ, హైస్కూల్‌లో సంక్రాంతి సంబరాలు గురువారం ఘనంగా నిర్వహించారు. వివిధ రకాల వేషధారణతో విద్యార్థులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. బాలికల రంగులు ముగ్గులు వేసి గొబ్బెమ్మలు పెట్టారు. భోగి మంట వేసి ఆనందంగా గడిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల వ్యవస్థాపకులు ఐనాల అప్పారావు, కరస్పాండెంట్‌ రామ్‌ కుమార్‌, ప్రిన్సిపాల్‌ నగేష్‌, విద్యార్థులు పాల్గొన్నారు.