Nov 17,2023 19:42

మాట్లాడుతున్న పట్టణ ఎస్‌ఐ మస్తాన్‌ వలీ

ప్రజాశక్తి - ఎమ్మిగనూరు
విద్యాహక్కు చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని హ్యూమన్‌ రైట్స్‌ కమిటీ రైట్‌ టు ఇన్ఫర్మేషన్‌ ట్రస్ట్‌ డివిజన్‌ అధ్యక్షులు అజిత్‌ కుమార్‌ పేర్కొన్నారు. శుక్రవారం పట్టణంలోని ఉర్దూ హైస్కూల్లో హ్యూమన్‌ రైట్స్‌ కమిటీ రైట్‌ టు ఎడ్యుకేషన్‌ యాక్ట్‌ 2009 విద్యా హక్కు చట్టం అమలుకు సంబంధించి, బాల్య వివాహాలు, చైల్డ్‌ అబ్యూజ్‌ గురించి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యఅతిథి పట్టణ ఎస్‌ఐ మస్తాన్‌ వలీ, ట్రస్ట్‌ డివిజన్‌ అధ్యక్షులు అజిత్‌ కుమార్‌ మాట్లాడారు. ఉచిత విద్య నిర్బంధ హక్కు చట్టం (ఆర్‌టిఇ) అనేది ఆగస్టు 4, 2009న పార్లమెంట్‌ చట్టం ద్వారా రూపొందించినట్లు తెలిపారు. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 21ఎలో ఉందని, 6 నుంచి 14 ఏళ్ల విద్యార్థులందరికీ ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను అమలు చేయాలని చెప్పారు. బాల్య వివాహాలను ప్రోత్సహించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బాలికలను వేధింపులకు గురి చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఉర్దూ హైస్కూల్‌ ప్రధానోపాధ్యాయులు కోటప్ప మాట్లాడుతూ... విద్యాహక్కు చట్టాన్ని అమలు చేయడంలో భాగంగా బడిబయట ఉన్న విద్యార్థులను బడిలోకి తీసుకొచ్చి వంద శాతం ఎన్‌రోల్‌మెంట్‌ సాధించి విద్యా ప్రగతికి కృషి చేస్తామని తెలిపారు. ఇంగ్లీష్‌ టీచర్‌ ఇషాద్‌ అహ్మద్‌ మాట్లాడుతూ... విద్యార్థులందరూ విద్యలో రాణించి దేశ ప్రగతిలో వెన్నెముకగా నిలబడాలని తెలిపారు. హెచ్‌ఆర్‌సి సభ్యులు ప్రతాప్‌, శ్రీకాంత్‌, హనుమంతు పాల్గొన్నారు.