ప్రజాశక్తి - రెంటచింతల : వెనకబడిన పల్నాడు ప్రాంతంలో అక్షరాస్యతా శాతం 58 శాతమే ఉందని, దీన్ని అధిగమించడానికి ఎల్‌ఆర్ ఫౌండేషన్ లాంటి స్వచ్ఛంద సంస్థలు చొరవ చూపడం అభినందనీయమని ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు అన్నారు. విశ్రాంత హెచ్‌ఎం ఎం.లక్ష్మారెడ్డి రెండో వర్ధంతి సందర్భంగా మండల కేంద్రమైన రెంటచింతలలోని సెయింట్ జోసెఫ్ ఉన్నత పాఠశాల ఆడిటోరియంలో 'అభ్యసన లోపాలు గుర్తించడం ఎలా?' అనే అంశంపై ఆదివారం వర్క్‌షాప్ నిర్వహించారు. లక్ష్మణరావు మాట్లాడుతూ విద్యతోనే అభివృద్ధి సాధ్యమని, ఇంత కీలకమైన విద్యా బోధనలో జాగ్రత్తలు అవసరమని చెప్పారు. అనంతరం 8 మంది జెడ్‌పి పాఠశాలల ఉపాధ్యాయులకు ఒక్కొక్కరికి రూ.15 వేల చొప్పున ప్రోత్సాహాకాలను, ప్రశంసా పత్రాలను అందించారు. ఎల్‌ఆర్ ఫౌండేషన్ ఇప్పటికే 24 కంప్యూటర్లను వివిధ పాఠశాలకు ఉచితంగా అందజేసింది. కార్యక్రమంలో ఎల్‌ఆర్ ఫౌండేషన్ డైరెక్టర్ ఎం.శ్రీనివాస్‌రెడ్డి, ఎన్నారై ఎం.మధుసూదన్‌రెడ్డి, డాక్టర్ శ్రీసుధా, ఎంబి చిన్నమ్మ, సాల్మన్‌రాజు, శ్రీనివాసరావు పాల్గొన్నారు.










