ప్రజాశక్తి - గోనెగండ్ల
విద్యా వ్యవస్థను మార్పు చేసి విప్లవాత్మక మార్పులు తెస్తామని పైకి గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వ విధానాలు ప్రాథమిక విద్యా వ్యవస్థను నాశనం చేస్తున్నాయని యుటిఎఫ్ జిల్లా అధ్యక్షులు జె.ఎల్లప్ప తెలిపారు. శనివారం గోనెగండ్లలోని లక్ష్మీపేట మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో యుటిఎఫ్ మండల అధ్యక్షులు రామన్ ఆధ్వర్యంలో 'విద్యారంగ సవాళ్లు-దాని పర్యావసనాలు' అనే అంశంపై విద్యా సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రభుత్వం నూతన విద్యా విధానం పేరుతో విద్యావ్యవస్థనే నిర్వీర్యం చేస్తూ బడుగు, బలహీన వర్గాల పిల్లలను విద్యకు దూరం చేస్తోందని వాపోయారు.
జిఒ 117ను అమలు చేసి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రాథమిక పాఠశాలలను ఉన్నత పాఠశాలలలో విలీనం చేసి ప్రాథమిక పాఠశాలలు మూతపడేలా చేసిందని తెలిపారు.
పదోన్నతి పొంది బదిలీ అయిన వారికి సన్మానం
మండలంలో పదేళ్ల నుంచి పని చేస్తూ పదోన్నతి పొంది వేరే మండలానికి బదిలీ అయిన 20 మంది ఉపాధ్యాయులను యుటిఎఫ్ ఆధ్వర్యంలో సన్మానించారు. ముఖ్య అతిథులుగా ఎంఇఒలు రామాంజనేయులు, నీలకంఠ హాజరయ్యారు. యుటిఎఫ్ జిల్లా కార్యదర్శి నరసింహులు, నాయకులు చంద్రపాల్, గుమ్మల బాబు, అక్బర్, ఖాజన్న, నాగేశ్వరావు, రాముడు, నాయక్, పద్మ, నిర్మల, శ్యామల, జెరినా పాల్గొన్నారు.
మాట్లాడుతున్న జిల్లా అధ్యక్షులు ఎల్లప్ప










