ప్రజాశక్తి-పిఠాపురం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విద్యా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా విద్యార్థులు ఐక్యం అవ్వాలని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి ఎ.అశోక్ పిలుపు ఇచ్చారు. ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ప్లీనరీ సమావేశాలు ఆదివారం స్థానిక సూర్యరాయ విద్యానంద గ్రంథాలయ ఆవరణలో ప్రారంభమయ్యాయి. తొలుత ఎస్‌ఎఫ్‌ఐ జెండాను జిల్లా అధ్యక్షుడు జి.రాము ఆవిష్కరించారు. అనంతరం ప్లీనరీలో అశోక్ మాట్లాడారు. మోడీ ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన జాతీయ విద్యా విధానం వల్ల విద్యార్థులకు విద్యకు దూరం అయ్యా ప్రమాదం ఉందన్నారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం జాతీయ విద్యా విధానాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం రూ.వేల కోట్ల ప్రజాధనంతో వైద్య కళాశాలలను ప్రారంభిస్తున్నామని పెద్దఎత్తున ప్రచారం చేసు కుంటోందని, ప్రారంభించిన ఐదు వైద్య కళాశాలల్లో సీట్లు అమ్ముకునేందుకు 107, 108 ఉత్తర్వులు తీసు కొచ్చారని విమర్శించారు. ఈ సీట్ల అమ్మకం భవిష్యత్తులో అన్ని కళాశాలల్లో అమలు చేస్తారన్నారు. ఇది వైద్య విద్య పేదలకు దూరం చేయడమేనని చెప్పారు. ఎస్‌సి, ఎస్‌టి, బిసి, మైనార్టీ విద్యార్థులకు ద్రోహం చేసినట్లే అన్నారు. ముఖ్యమంత్రి రాష్ట్రంలో విద్యలో విప్లవాత్మమైన మార్పులు అంటే బలహీన వర్గాల ప్రజలకు విద్యను దూరం చేయడమేనా అని ప్రశ్నించారు. పిఠాపురంలో డిగ్రీ కళాశాలను పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం జిల్లా కార్యదర్శి ఎం.గంగాసూరిబాబు నివేదిక ప్రవేశ పెట్టారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా నాయకులు వరహాలు, శ్రీకాంత్, కృప, దినేష్, సిద్ధు, వెంకటేష్, లోవరాజు, మణికంఠ, అరుణ్, గోపాల్, శివ, సంజరు పాల్గొన్నారు.










