
ప్రజాశక్తి - బాపట్ల
విద్యా వ్యాప్తితోనే నవ సమాజ నిర్మాణం జరుగుతుందనే కాంక్షతో బాపట్ల ప్రాంతంలో విద్యావ్యాప్తికి అన్నవరపు పుండరీకాక్షుడు విశేషంగా కృషి చేశారని మానవ వనరుల అభివృద్ధి సంస్థ వ్యవస్థాపక డైరెక్టర్ జనరల్ డి చక్రపాణి అన్నారు. అన్నవరపు పుండరీకాక్షుడి 175వ జయంతి సందర్భంగా ఫోరం ఫర్ బెటర్ బాపట్ల ఆధ్వర్యంలో ఎవివి ఉన్నత పాఠశాలలో శనివారం జరిగిన జయంతి సభలో చక్రపాణి మాట్లాడారు. 1913లోనే బాలికా పాఠశాల స్థాపనకు 13ఎకరాల స్థలాన్ని దానం చేసి విద్యావ్యాప్తికి పాటుపడిన విద్యా దాత అన్నారు. ఆర్ట్స్ కళాశాల స్థాపనకు ఆయన ఏర్పరిచిన నిధి రూ.50వేల విరాళంగా ఇచ్చారు. అభ్యుదయ భావాలు గల పుండరీకాక్షుడి జీవితం నేటి తరానికి ఆదర్శం కావాలని అన్నారు. పట్టణ నడిబొడ్డున ఎవివి పాఠశాలను స్థాపించి ఎందరో విద్యార్థులకు విద్యాదానం చేసిన అన్నవరపు సేవలు మరువ రానివని చెప్పారు. ఆర్ట్స్ కళాశాల విశ్రాంత ప్రిన్సిపల్ డబ్ల్యూ జికె మూర్తి అధ్యక్షత వహించిన సభలో ఫోరమ్ కార్యదర్శి పిసి సాయిబాబు, పాఠశాల హెచ్ఎం ఎస్‌విఆర్ ప్రసాద్, జనచైతన్య వేదిక అధ్యక్షుడు వి లక్ష్మణరెడ్డి పాల్గొన్నారు.