Apr 17,2023 22:06

వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడుతున్న కలెక్టర్‌

ప్రజాశక్తి-గుంటూరు : విద్యా, వైద్యారోగ్య శాఖల్లో ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలు క్షేత్ర స్థాయిలో సరిగా అమలయ్యేలా మండల స్థాయి అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని జిల్లా కలెక్టర్‌ ఎం.వేణుగోపాల్‌రెడ్డి ఆదేశించారు. వివిధ శాఖల అధికారులతో కలెక్టరేట్‌లోని వీసీ సమావేశ మందిరం నుంచి కలెక్టర్‌ వేణుగోపాల్‌రెడ్డి సోమవారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించారు. బడి మానేసిన పిల్లలను తిరిగి చేర్పించాలని, వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఒక్క విద్యార్థి కూడా పాఠశాలలు మానివేయకుండా తగిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. విద్యా హక్కు చట్టం ద్వారా ప్రైవేటు పాఠశాలలో ఉచితంగా సీట్లు కేటాయింపును సంబంధించి దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం మరోసారి అవకాశం కల్పిస్తున్నందున, ఎక్కువ మంది దరఖాస్తు చేసుకునేలా విస్తృతంగా ప్రచారం కల్పించాలన్నారు. ఫ్యామిలీ డాక్టరు విధానం కార్యక్రమం నిర్దేశిత లక్ష్యాల మేరకు సరిగా జరిగేలా మెడికల్‌ అధికారులు ప్రణాళిక ప్రకారం చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో డిఇఒ పి.శైలజ, డిఎంహెచ్‌ఒ డాక్టర్‌ శ్రావణబాబు పాల్గొన్నారు.
ఉచిత వైద్యసేవలు అభినందనీయం
ప్రభుత్వ ఉద్యోగులకు రెండ్రోజులపాటు నిర్వహించిన ఉచిత మెడికల్‌ క్యాంపులో వైద్యసేవలు అందించిన ఆస్పత్రుల యాజమాన్యలను కలెక్టర్‌ ఎం.వేణుగోపాల్‌రెడ్డి, జెసి జి.రాజకుమారి అభినందించారు. గుంటూరు జి.జి.హెచ్‌, మణిపాల్‌ వైద్యశాల, లలిత సూపర్‌ స్పెషాలిటీ వైద్యశాల, కాటూరి మెడికల్‌ కళాశాల, ఆదిత్య వైద్యశాల, శ్రీ హాస్పిటల్‌, డాక్టర్‌ ఆగర్వాల్‌ కంటి వైద్యశాల, ప్రత్యూష డెంటల్‌, స్మైల్‌ డెంటల్‌, హాసినీ డెంటల్‌ వైద్యశాలల ప్రతినిధులను సన్మానించి జ్ఞాపికలు అందించారు.