విద్యా సంస్థల బంద్‌ను జయప్రదం చేయండి
విద్యార్థి సంఘ నాయకుల బైక్ ర్యాలీ
ప్రజాశక్తి - క్యాంపస్ : ఈ నెల 8వ తేదీ నిర్వహించనున్న రాష్ట్ర వ్యాప్త విద్యా సంస్థల బంద్‌ను జయప్రదం చేయాలని కోరుతూ ఎస్‌ఎఫ్‌ఐ, ఏఐఎస్‌ఎఫ్, పిడిఎస్‌యు నాయకులు తిరుపతిలో సోమవారం బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బండి చలపతి, ఎస్‌ఎఫ్‌ఐ మాధవ్, ఏఐవైఎఫ్ రామ కష్ణ, పీడిఎస్యూ ఆది మాట్లాడుతూ విశాఖ ఉక్కు ఆత్మగౌరవాన్ని కార్పొరేట్ కంపెనీలకు తాకట్టు పెడితే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. విద్యార్థి ,యువజన నాయకులు 32 మంది ప్రాణ త్యాగాలతో ఏర్పాటైన విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని మోడీ ప్రభుత్వం ప్రైవేటీకరణకు పూనుకోవడాన్ని నిరసిస్తూ స్వాతంత్రోద్యమ స్ఫూర్తితో ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టకుండా జరుగుతున్న ఆత్మగౌరవ పోరాటం నవంబర్ 8 నాటికి వెయ్యి రోజులు అవుతున్న సందర్భంగా వామపక్ష విద్యార్థి, యువజన సంఘాల ప్రత్యక్ష ఆందోళనలకు పిలుపునిచ్చామన్నారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ పోరాడిన అమరవీరుల త్యాగాలు స్ఫూర్తితో విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం అన్ని వర్గాల చైతన్యం కల్పించి ఐక్యం చేస్తామన్నారు. కరువుకు నిలయమైన రాయలసీమ ప్రాంతం కడపలో విభజన హామీలు అమలు చేయాలని రాష్ట్రంలోని బిజెపి నేతలు మోడీని ప్రశ్నించకపోవడం సిగ్గుచేటు అన్నారు. మరోవైపు రాష్ట్ర ప్రయోజనాల కంటే ముఖ్యమంత్రికి వ్యక్తిగత ప్రయోజనాలు ఎక్కువ అయ్యాయన్నారు. కేసుల భయంతో మోడీ ముందు మోకరిల్లుతున్నారని దుయ్యబట్టారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా కడపలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేసి స్థానిక యువతకి ఉపాధి కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ పరిరక్షణ, కడప ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం విద్యార్థి, యువజన సంఘాల ఆధ్వర్యంలో నవంబర్ 8వ తేదీ న రాష్ట్రవ్యాప్తంగా కేజీ టు పేజీ వరకు జరిగే విద్యాసంస్థల బంద్ కు జిల్లాలోని విద్యార్థిని విద్యార్థులు ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలు, మేధావులు, ప్రజలు ప్రతి ఒక్కరూ మద్దతు తెలిపి సహకరించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం లో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షులు రవి, అక్బర్, శివ, ఏఐఎస్‌ఎఫ్ జిల్లా అధ్యక్షులు నవీన్, సుందర్ రాజు, ఓమ్ రాజ్, హరి కష్ణ, వినరు,రంజిత్, యువ, గిరి, శ్రీను, ఏఐవైఎఫ్ శ్రీను, పీడిఎస్‌యు నాయకులు మహేష్ పాల్గొన్నారు.










