రాజంపేట అర్బన్ : విద్యార్థి యువజన సంఘాలు ఉక్కు రక్షణ, ఉక్కు సాధన కోసం నిర్వహించిన బంద్ విజయవంతమైంది. బుధవారం జిల్లాలో అన్ని విద్యా సంస్థలు బంద్‌కు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. విద్యా సంస్థలు మూతపడ్డాయి. విశాఖ ఉక్కు రక్షణ, కడప ఉక్కు నిర్మాణం కోసం ఎస్‌ఎఫ్‌ఐ, పిడిఎస్‌యు, ఎఐఎస్‌ఎఫ్ ఆధ్వర్యంలో ఇచ్చిన బంద్ చేపట్టారు. కేజీ టు పీజీ వరకు ప్రయివేట్ విద్యా సంస్థలు ముందుగానే విద్యార్థులకు సెలవు ప్రకటించాయి. ప్రభుత్వ విద్యా సంస్థలను విద్యార్థి, యువజన సంఘాల నాయకులు వెళ్లి బంద్‌కు మద్దతి ఇవ్వమని కోరగానే అన్ని సంస్థలు స్వచ్ఛందంగా బంద్‌లో పాల్గొన్నాయి. ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షులు రమణ, పిడిఎస్‌యు జిల్లా అధ్యక్షలు నాగేశ్వరరావు మాట్లాడుతూ విద్యార్థులు, యువకుల 32 మంది బలిదానాలతో, వామపక్ష పార్టీల ఎంపీల రాజీనామాలతో సోవియట్ యూనియన్ సహకారంతో ఏర్పడిన విశాఖ ఉక్కు ప్రయివేటీకరణ ఆలోచనను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. 25 మంది ఎంపీలను గెలిపిస్తే కేంద్రం మెడలు వంచుతానన్న జగన్మోహన్‌రెడ్డి రోజు ఢిల్లీ కేంద్రం ముందు మోకరిల్లుతున్నారని విమర్శించారు. ఉక్కు రక్షణ కోసం పనిచేయడం లేదని ఆరోపించారు. ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం, జనసేన పార్టీ సైతం విశాఖ ఉక్కు రక్షణ అత్యంత వెనుకబడిన రాయలసీమ ప్రాంతంలో ఉక్కు నిర్మాణం కోసం ఏ మాత్రం కషి చేయడం లేదని తెలిపారు. ఇలాగే వ్యవహరిస్తే రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పక్షాలకు విద్యార్థులు, యువకులు, వారి కుటుంబ సభ్యులను చైతన్యం చేసి ఈ మూడు పార్టీలకు తగిన శాస్తి చెబుతామని హెచ్చరించారు. ఒక పల్లెటూరి నుంచి రాష్ట్రంలోనే అతిపెద్ద పారిశ్రామిక నగరంగా ఎదగడానికి విశాఖ ఉక్కు గాజువాక కు తోడ్పడిందని చెప్పారు. వేలాదిమందికి ఉపాధి కల్పిస్తుందని, అటువంటి ఉక్కు పరిశ్రమనే కడపలో నిర్మాణం చేయాలని డిమాండ్ చేశారు. ఉక్కు రక్షణ కోసం, ఉక్కు సాధన కోసం, విద్యార్థి యువజన సంఘాల పోరాటం ఇది ఆరంభం మాత్రమేనన్నారు. భవిష్యత్తులో మరిన్ని ఉద్యమాలను ఉధతం చేస్తామని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరించారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు గోవర్ధన్, చెంగయ్య, గౌరీ శంకర్, హరి చరణ్, ఎఐఎస్‌ఎఫ్ నాయకులు మహమ్మద్, రాజు, పిడిఎస్‌యు నాయకులు మురళి, సతీష్ పాల్గొన్నారు. గాలివీడు : మండలంలో జరిగిన విద్యాసంస్థల బంద్ విజయవంతమైంది. ప్రాథమిక ఉన్నత పాఠశాలు, ప్రయివేట్ పాఠశాలలు ఎస్‌ఎఫ్‌ఐ విద్యార్థులు రాకతో పాఠశాలలను మూసివేశారు. విశాఖ ఉక్కుపరిశ్రమను ప్రయివేట్ పరం కాన్విమని, కడప ఉక్కు ఏర్పాటయ్యేంత వరకు పోరాటాలు చేస్తూనే ఉంటామని విద్యార్థినాయకులు తెలిపారు. మదనపల్లె : కడప ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని విశాఖ ఉక్కు ప్రైవేటికరణ ఆపాలని చేపట్టిన విద్యాసంస్థల బంద్ విజయవంతమైంది. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షులు కార్తీక్, ఎఐఎస్‌ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు వినరు, నాయకులు జయబాబు పాల్గొన్నారు.