Feb 02,2023 00:01

ముంచంగిపుట్టులో పిఒ దిష్టిబొమ్మను దగ్ధం చేస్తున్న నాయకులు

ప్రజాశక్తి-పాడేరు: గిరిజన విద్యార్థుల సమస్యలు, వీటి పరిష్కారానికై రిలే దీక్షలు చేపట్టిన ప్రజా సంఘాల వేదిక నాయకుల అరెస్టులను నిరసిస్తూ పిలుపునిచ్చిన బుధవారం నాటి విద్యా సంస్థల బంద్‌ పాడేరు ఏజెన్సీలో విజయవంతమైంది. పాడేరు పట్టణంలోని ప్రైవేటు విద్యా సంస్థలు బంద్‌ కారణంగా మూతపడ్డాయి. ప్రాక్టికల్‌ పరీక్షలకు హాజరవుతున్న కళాశాలల విద్యార్థులకు బంద్‌ నుంచి మినహాయింపు నిచ్చారు. ఈ సందర్భంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాల వద్ద విద్యార్థులతో జరిగిన సమావేశంలో ప్రజా సంఘాల ఐక్యవేదిక కన్వీనర్‌ కే.రాధాకృష్ణ మాట్లాడుతూ, నిర్బంధాలు, అక్రమ అరెస్టులు, అణిచివేతతో ఉద్యమాలను ఆపలేరన్నారు. విద్యార్థుల మరణాలపై హైకోర్టు సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించి, ఆశ్రమాల్లో హెల్త్‌ అసిస్టెంట్లు నియమించాలన్నారు. డిగ్రీ, ఇంటర్‌ ట్యూషన్‌, ఎగ్జామినేషన్‌ ఫీజులు ఐటిడిఎ చెల్లించాలన్నారు. ఆశ్రమల్లో అక్రమ డిప్యూటేషన్లు రద్దు చేసి, పెదబయలు మండల తహసీల్దారి మృతి పై రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర విచారణకు ఆదేశించాలని డిమాండ్‌ చేశారు. పాడేరు ఐటీడీఏ పీవోను బదిలీ చేయాలన్నారు. ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థి సంఘాలు, మీడియా ప్రతినిధుల అనుమతిని నిరాకరిస్తూ జారీ చేసిన నోటీసులు తక్షణమే రద్దు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల ఐక్యవేదిక నాయకులు బత్తిరి నరేష్‌, చిన్నారావు, కుమార్‌, కంబిడి లతకూమరి, స్వరూప, మువ్వల లక్ష్మణరావు, చంటి, చిన్ని, రాణి, విమల తదితరులు పాల్గొన్నారు.
అరకులోయ రూరల్‌:అరకులో ఎస్‌ఎఫ్‌ఐ, ప్రజా సంఘాల ఆధ్వర్యాన చేపట్టిన విద్యా సంస్థల బంద్‌ విజయవంతమైంది. అరకువేలి మండల కేంద్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలు మూతప డ్డాయి.ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ మండల కార్యదర్శి పి సురేంద్ర, ఎస్‌ఎఫ్‌ఐ గర్ల్స్‌ కన్వీనర్‌ ఎస్‌.గంగమ్మ మాట్లాడుతూ, గిరిజన విద్యార్థుల మరణాలపై జ్యుడిషియల్‌ విచారణ జరిపించి, పాడేరు ఐటీడీఎ పీఓ ను ప్రభుత్వం సరెండర్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రజా సంఘాల నేతలు ఐటిడిఏ వద్ద శాంతియుతంగా దీక్షలు చేపట్టినా గిరిజన ఎంపీ, ఎమ్మెల్యేలు ఎందుకు స్పందించ లేదని ప్రశ్నించారు.
పీవో దిష్టిబొమ్మను దగ్ధం
ముంచింగిపుట్టు:మండల కేంద్రంలోని నాలుగు రోడ్ల కూడలి వద్ద ఎస్‌ఎఫ్‌ఐ, గిరిజన ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఐటీడీఏ పీవో దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. మండల కేంద్రంలో ప్రభుత్వ, ప్రయివేటు విద్యా సంస్థలు స్వచ్చందంగా బంద్‌ పాటించాయి. ఐటీడీఏ పిఓ దిష్టిబొమ్మను నాలుగు రోడ్ల కూడలి లో దగ్దం చేశారు. ఈ సందర్భంగా గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు కె నరసయ్య, మండల కార్యదర్శి ఎంఎం శ్రీనులు ప్రభుత్వ జూనియర్‌ కాలేజ్‌లోని విద్యార్థులతో మాట్లాడుతూ, గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలన్నారు.ప్రభుత్వం స్పందించి సమస్యలు పరిష్కరించకుంటే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం నాయకులు గాసిరం, మండల వైస్‌ ఎంపిపి1 సత్యనారాయణ, సీపీఎం మండల కార్యదర్శి పి భీమరాజు, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కమిటీ సభ్యులు డోంమ్రు పాల్గొన్నారు.
ర్యాలీ, మానవహారం,
పెదబయలు: మండల కేంద్రంలో ఎస్‌ఎఫ్‌ఐ, గిరిజన సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన బంద్‌ విజయ వంతమైంది. ఈ సందర్భంగా గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పృధ్వీరాజ్‌ మాట్లాడుతూ, ఎన్నడూ లేని విధంగా విద్యార్దులు తరచూ మృత్యువాత పడుతున్నా, అధికారులు ఎందుకు స్పందించ లేదని ప్రశ్నించారు.విద్యార్దులు చర్మ వ్యాధులతో బాధ పడుతున్నా పట్టించుకునే నాథుడే లేడన్నారు.అనంతరం పెదబయలు కార్యాలయంలో విఆర్‌ఓకు వినతపత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ మండల కార్యదర్శి బోండా సన్నిబాబు, మహిళా సంఘం అధ్యక్షురాలు తల్లబు కౌసల్య, గిరిజన సంఘం కమిటీ సభ్యులు జంపరంగి సునీల్‌బాబు, కిల్లో శరబన్న, తదితరులు పాల్గొన్నారు.
బంద్‌ పాటించిన విద్యార్థులు
డుంబ్రిగూడ:ఎస్‌ఎఫ్‌ఐ, గిరిజన సంఘంతో పాటు పలు గిరిజన సంఘాలు పిలుపునిచ్చిన విద్యా సంస్థల బంద్‌ మండలంలో విజయవంతమైంది. ఈ సందర్భంగా బుధవారం ప్రభుత్వ జూనియర్‌ కళాశాల, ఆశ్రమ పాఠశాలల విద్యార్థులు స్వచ్ఛందంగా బంద్‌ పాటించారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు టి.సూర్యనారాయణ, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు తదితరులు పాల్గొన్నారు.