Nov 08,2023 21:30

బంద్‌తో మూతపడిన విజయనగరంలోని కస్పా హైస్కూలు

 ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ :  విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ రక్షణ, కడప స్టీల్‌ ప్లాంట్‌ ఏర్పాటుకై విద్యార్థి, యువజన సంఘాలు బుధవారం చేపట్టిన బంద్‌ జిల్లాలో విజయవంతమైంది. నగరంలోను, జిల్లాలోని పలు మండల కేంద్రాల్లోను విద్యార్థులను తరగతులు బహిష్కరించి బంద్‌లో పాల్గొన్నారు. పలు విద్యాసంస్థలు స్టీల్‌ప్లాంట్‌ రక్షణ కోసం బంద్‌కు మద్దతు ప్రకటించి ముందుగానే సెలవు ప్రకటించాయి. ఈ సందర్భంగా విజయనగరం కోట జంక్షన్‌ వద్ద విద్యార్థులు నిరసన, అనంతరం మానవహారం చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షులు సిహెచ్‌ వెంకటేష్‌, ఎఐఎస్‌ఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్‌.నాగభూషణం, పిడిఎస్‌యు జిల్లా కార్యదర్శి కె.గౌతమి మాట్లాడారు. 32 మంది ప్రాణ బలిదానంతో ఏర్పాటై లక్షలాది మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కల్పిస్తూ దేశాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న స్టీల్‌ప్లాంట్‌ను కారు చౌకగా అదానీ అంబానీలకు కట్టబెట్టడానికి కేంద్ర బిజెపి ప్రభుత్వం చేస్తున్న కుట్రలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. కార్మికులు వెయ్యి రోజులుగా చేస్తున్న స్టీల్‌ప్లాంట్‌ రక్షణ పోరాటానికి విద్యార్థులు, యువజనుల సహకారం ఉంటుందని తెలిపారు. వెనుకబడిన ఉత్తరాంధ్రకు విభజన హామీల్లో ఒక్కటి కూడా అమలు చేయలేదన్నారు. ఉత్తరాంధ్ర ఆత్మగౌరవంగా ఉన్నటువంటి విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటుపరం చేయడం తీరని ద్రోహమని, దానికి వత్తాసు పలుకుతున్న రాష్ట్ర ప్రభుత్వానికి త్వరలోనే గుణపాఠం తప్పదని హెచ్చరించారు. కడప స్టీల్‌ ప్లాంట్‌ కు నిర్మాణం వెంటనే చేపట్టాలన్నారు. కార్యక్రమంలో డివైఎఫ్‌ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు రుద్రరాజు, హరీష్‌ , ఎఐవైఎఫ్‌ జిల్లా అధ్యక్షులు బూర వాసు, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు రవి, సౌమ్య, రామకృష్ణ పి. గౌరీశంకర్‌, ఎ.సుమన్‌ తదితర విద్యార్థి యువజన సంఘాల నాయకులు పాల్గొన్నారు.

బొబ్బిలిలో తరగతులు బహిష్కరించి నిరసన తెలుపుతున్న విద్యార్థులు
బొబ్బిలిలో తరగతులు బహిష్కరించి నిరసన తెలుపుతున్న విద్యార్థులు


బొబ్బిలి : విద్యార్థి సంఘాలు చేపట్టిన బంద్‌ పట్టణంలో జయప్రదమైంది. పలు విద్యాసంస్థలు స్వచ్ఛందంగా బంద్‌లో పాల్గొన్నాయి. పొట్టిశ్రీరాములు బాలికల హైస్కూలు, గొల్లపేట జెడ్‌పి హైస్కూలును ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు దగ్గరుండి మూయించారు. పలు ప్రభుత్వ విద్యాసంస్థలకు చెందిన విద్యార్థులు ర్యాలీలు నిర్వహించారు. ప్రభుత్వ ఐటిఎ కళాశాల వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి పి.రామ్మోహన్‌ మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్రానికి అన్ని విధాలుగా మోసం చేసిన బిజెపి విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేట్‌ పరం చేస్తోందని తెలిపారు. విద్యార్థులు, యువకులు కలిసి ఈ ప్రయత్నాలను అడ్డుకోవాలని అన్నారు. ఎఐవైఎఫ్‌ నాయకులు అప్పన్న, ఎఐఎస్‌ఎఫ్‌ జిల్లా సహాయ కార్యదర్శి రవి, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు వాసు,డేవిడ్‌ పాల్గొన్నారు.
గజపతినగరం : బంద్‌తో మండలంలోని ప్రభుత్వ ఇంటర్‌, డిగ్రీ కళాశాలలు, ప్రభుత్వ పాఠశాలలు, మరుపల్లి మోడల్‌ స్కూలు, ప్రైవేటు పాఠశాలలు మూతపడ్డాయి. ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా సహాయ కార్యదర్శి డి.రాము, డివైఎఫ్‌ఐ నాయకులు తాతినాయుడు, మండల నాయకులు చిన్నారి, నందిని, శిరీష, ఈశ్వరరావు, వెంకటేష్‌ ఆధ్వర్యాన బంద్‌ జరిగింది.
కొత్తవలస : విద్యార్థి సంఘాలు చేపట్టిన బంద్‌ జయప్రదమైంది. ప్రభుత్వ పాఠశాలలు, మోడల్‌ స్కూల్‌, జూనియర్‌ కాలేజీలను, ప్రైవేట్‌ పాఠశాలలు మూతపడ్డాయి. ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు నాయుడు,చైతన్య మాట్లాడారు. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటుకరణ ఆపాలి, కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో ఎస్‌.ఎఫ్‌.ఐ నాయకులు గణేష్‌,తేజ,భరత్‌ తదితరులు, పాల్గొన్నారు

   ఎస్‌.కోటలో మానవహారం చేస్తున్న విద్యార్థులు
ఎస్‌.కోటలో మానవహారం చేస్తున్న విద్యార్థులు

శృంగవరపుకోట : ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కమిటీ సభ్యులు వి.చినబాబు ఆధ్వర్యాన విద్యార్థులు తరగతులను బహిష్కరించి బంద్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కళాశాల విద్యార్థులు బోసుబొమ్మ జంక్షన్‌ వరకు ర్యాలీనిర్వహించారు. అనంతరం అక్కడ మానవహారం చేపట్టారు. స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేటుపరం చేస్తే విద్యార్థిలోకం ఉద్యమిస్తుందని అన్నారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ మండల కార్యదర్శి రమేష్‌, కళ్యాణి, జ్యోతి, భార్గవి, రమాదేవి, ప్రశాంతి, రాము, రవి, డివైఎఫ్‌ఐ నాయకులు సతీష్‌, రిషి తదితరులు పాల్గొన్నారు.
జామి : మండలంలోని పలు విద్యాసంస్థలు స్వచ్ఛందంగా బంద్‌ లో పాల్గొన్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలను ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు దగ్గరుండి మూయించారు. ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా సహాయ కార్యదర్శి ఎం.హర్ష మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్రానికి అన్ని విధాలుగా మోసం చేసిన బిజెపిని తరిమికొట్టాలని అన్నారు. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటుకరణ ఆపాలని, కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు చరణ్‌, రవి తదితరులు, అధిక సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు
బాడంగి : బంద్‌తో కోడూరు, బాడంగి జెడ్‌పి హైస్కూళ్లు, షికారుగంజి మోడల్‌ స్కూలు, రామచంద్రపురం, పిన్నవలస, పూడువలస ప్రాథమిక పాఠశాలలు మూతపడ్డాయి. ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు జోగి హరికృష్ణ మాట్లాడారు. గరివిడి : చీపురుపల్లి, గరివిడిలో విద్యాసంస్థల బంద్‌ జయప్రదమైంది. ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా సహాయ కార్యదర్శి ఎం. వెంకటేష్‌ మాట్లాడుతూ విద్యార్థులు, యువజనులు కలిసి స్టీల్‌ప్లాంట్‌ను కాపాడుకోవాలన్నారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు వంశీ, రమణ, ప్రసాద్‌, సాయి, మేఘన, రూప తదితరులు పాల్గొన్నారు.
నెల్లిమర్ల : ప్రభుత్వ హైస్కూలు, కళాశాలల విద్యార్థులు తరగతులు బహిష్కరించారు. ఈ సందర్భంగా ఎస్‌.ఎఫ్‌.ఐ జిల్లా సహాయ కార్యదర్శి జె.రవికుమార్‌ మాట్లాడారు. బాలాజీ, శ్రీనివాస్‌ పాల్గొన్నారు.