Aug 23,2022 23:56

బంద్‌లో భాగంగా విశాఖలోని మహిళా డిగ్రీ కళాశాల నుంచి ప్రదర్శన నిర్వహిస్తున్న విద్యార్థి నేతలు

విద్యా రంగ సమస్యలను పరిష్కరించాలంటూ అఖిలపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యాన రాష్ట్ర వ్యాప్తంగా మంగళవారం చేపట్టిన విద్యాసంస్థల బంద్‌ విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో విజయవంతమైంది. విశాఖ జిల్లాలో ఎస్‌ఎఫ్‌ఐ, ఎఐఎస్‌ఎఫ్‌, పిడిఎస్‌ఒ, ఎఐడిఎస్‌ఒల ఆధ్వర్యంలో డాబా గార్డెన్స్‌లోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల సమీప ప్రాంతాల్లో ప్రదర్శన నిర్వహించారు. మరోపక్క ఈ బంద్‌ను నిర్వీర్యం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో పోలీసులు శతవిధాలా ప్రయత్నించారు. గాజువాక, మద్దిలపాలెం ప్రాంతాల్లో బంద్‌ నిర్వహిస్తున్న 14 మందిని పోలీసులు అరెస్టు చేశారు. అనకాపల్లి జిల్లాలో అనకాపల్లి మండల కేంద్రంతోపాటు నర్సీపట్నం, చోడవరం, నక్కపల్లి, అచ్యుతాపురం ప్రాంతాల్లో విద్యార్థి సంఘాల ప్రస్తుత, పూర్వ నాయకులను అరెస్టులు చేశారు. ఈ నిర్బంధమేదీ బంద్‌ను ఆపలేకపోయింది.
ప్రజాశక్తి - కలెక్టరేట్‌ : విద్యా సంస్థల బంద్‌లో భాగంగా డాబాగార్డెన్స్‌లోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల వద్ద విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎల్‌జె.నాయుడు మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా, విద్యార్థి వ్యతిరేక విధానాలన్నింటికీ వ్యతిరేకంగా జరిగిన బంద్‌ విజయవంతం కావడం సర్కారుకు పెద్ద హెచ్చరికని అన్నారు. ప్రభుత్వం బంద్‌ జరగకుండా ఎస్‌ఎఫ్‌ఐ నాయకులను ముందస్తు అరెస్టులు చేసి నిర్బంధించిందని, ఆయనప్పటికీ జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రయివేటు కాలేజీలు, స్కూళ్లు మూతపడ్డాయని తెలిపారు. విద్యార్థులు, విద్యా సంస్థల యాజమాన్యాలు స్వచ్ఛందంగా ఈ బంద్‌లో పాల్గొన్నట్టు తెలిపారు. పాఠశాలల విలీనాన్ని ఆపాలని, సంక్షేమ విద్యార్థుల మెస్‌ ఛార్జీలు పెంచాలని, నాణ్యతతో కూడిన విద్యా కానుక బ్యాగ్స్‌, యూనిఫాం అందించాలని డిమాండ్‌ చేశారు. పీజీ విద్యార్థులకు శాపంగా మారిన జీవో 77ను రద్దు చేసి విద్యా దీవెన వారికి కూడా వర్తించేలా చర్యలు చేపట్టాలన్నారు. గాజువాక, మద్దిలపాలెం ప్రాంతాలలో ఎస్‌ఎఫ్‌ఐ నాయకులను అరెస్టు చేయడాన్ని ఈ సందర్భంగా ఆయన ఖండించారు. ఎఐఎస్‌ఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి వి.జాన్సన్‌ బాబు మాట్లాడుతూ జగన్మోహన్‌ రెడ్డి ప్రభుత్వం విద్యా వ్యతిరేక విధానాలు విడనాడి పేద ప్రజలకు విద్య చేరువులో ఉండేలా చర్యలు చేపట్టాలన్నారు. పిడిఎస్‌ఒ రాష్ట్ర కార్యదర్శి ఎ.అశోక్‌ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నూతన విద్యా విధానాన్ని అమలు జరిపి పేద, బడుగు బలహీన వర్గాల విద్యార్థులను ఇబ్బందుల పాల్జేస్తోందన్నారు. నూతన విద్యా విధానాన్ని అమలు చేస్తే దేశ రాజ్యాంగానికి ప్రమాదమని తెలియజేశారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా నాయకులు రాఘవేంద్ర, శివశంకర్‌, దుర్గ, అజరు, నిఖిల్‌, పిడిఎస్‌ఒ నాయకులు విశ్వనాథం, ఇతర నాయకులు డి.ఫణీంద్ర, అభిలాష్‌ తదితరులు పాల్గొన్నారు.
గాజువాక : పారిశ్రామిక ప్రాంతంలో విద్యా సంస్థలన్నీ స్వచ్ఛందంగా మూతపడ్డాయి. నారాయణ, శ్రీచైతన్య కళాశాలలు, ఎంవిఆర్‌, చలపతి, రవీంద్ర భారతి పాఠశాలల వద్ద ఎస్‌ఎఫ్‌ఐ గాజువాక కమిటీ నాయకులు బంద్‌ పాటిస్తుండగా పోలీసులు అరెస్టు చేశారు. సంఘం జోన్‌ నాయకులు శశి కుమార్‌, శ్రావణి, అజరు కుమార్‌, గణేష్‌, మౌనిక, ధనుష్‌ అరెస్టయిన వారిలో ఉన్నారు.