ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధి జిల్లాలో అన్ని మండల విద్యాశాఖాధికారి కార్యాలయాల పరిధి, కార్యాలయాల్లో పని చేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కరువయ్యింది. 2011 నుంచి విధులు నిర్వర్తిస్తున్నా సమాన పనికి సమాన వేతనాలు అందుకోలేకపోతున్నారు. అటు పనికి తగిన జీతాలు రాక ఇటు ఉద్యోగాలు క్రమబద్ధీకరణ కాక తమకు ఎదురు చూపులే మిగిలాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు మూడు నెలలుగా వేతనాలు అందక అప్పులు చేస్తున్నామని తెలిపారు. కుటుంబ పోషణ కోసం అనేక అవస్థలు ఎదుర్కొంటున్నామని, అధికారులు సమస్యలను పరిష్కరించడాని కృషి చేయాలని కోరుతున్నారు.
సర్వ శిక్షాభియాన్ ద్వారా కాంట్రాక్టు పద్ధతిలో 2011లో కలెక్టర్, జిల్లా ఎంపిక కమిటీ ద్వారా ఎపి స్టేట్ అండ్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్ 1996, రూల్ 22 ప్రకారం రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రాతిపదికన రాత పరీక్ష ద్వారా ప్రతిభ ఆధారంగా కాంట్రాక్టు ఉద్యోగులను నియమించారు. సమగ్ర శిక్ష, విద్యా శాఖలో మండల లెవెల్, కాంప్లెక్స్, వివిధ పాఠశాలల్లో ఎంఐఎస్‌లు 65 మంది, సిఒలు 65 మంది, ఎంఎల్‌ఎ (మండల లెవెల్ అకౌంట్), సిఆర్‌పిలు 300 మంది, ఐఇఆర్‌టిలు 150 మంది, అసిస్టెంట్ ఎంఆర్‌సిలు 65, పార్ట్ టైం టీచర్స్ 800 మంది ఉండగా ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 1,660 మంది పని చేస్తున్నారు. జగనన్న అమ్మఒడి, జగనన్న విద్యా కానుక, ఒఎస్‌సి చిల్డ్రన్, బడి బయట పిల్లలను గుర్తించి పాఠశాలల్లో చేర్పించడం, జగ్గనన్న గోరుముద్ద, నాడు-నేడు, పిల్లలపై విశ్లేషణ వంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. విద్యాశాఖలో అన్ని రకాల ముఖ్య సమాచారం నివేదికలను అందించడంలో వీరంతా ముఖ్య భూమికను పోషిస్తున్నారు. ఎంఇఒ కార్యాలయాల్లో పాఠశాల విద్యాశాఖకు సిబ్బంది లేనందున సంబంధిత శాఖ పరిపాలనా పరమైన విధులు, భాధ్యతలు నిర్వహిస్తున్నారు. మండల విద్యాశాఖాధికారికి సబార్డినేట్స్‌గా విద్యాభివద్ధికి సంబంధించి అన్ని రకాల భాధ్యతలు చేస్తున్నారు.
హామీ అమలు మరచిన జగన్
వీరికి ఎటువంటి ఉద్యోగ భద్రత కానీ పిఆర్‌సిలో జీతాలు పెంచడం కానీ, ఎంటిఎస్ అమలు చేయడంలో గానీ ప్రభుత్వం చొరవ తీసుకోలేదు. నాడు ప్రజా సంకల్ప యాత్రలో 2018 జూన్ 4న కాంట్రాక్టు ఉద్యోగులు జగన్‌కు వినతిపత్రం అందజేశారు. వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కాంట్రాక్టు ఉద్యోగులు వారి సర్వీస్ అర్హతలను బట్టి సాధ్యమైనంత ఎక్కువమందిని క్రమబద్ధీకరించి ప్రభుత్వ పరిధిలోకి తీసుకువస్తామని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు పైనే కావస్తున్నా నేటికీ సిఎం స్పందించలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఉద్యోగ భద్రత కల్పించి 23 శాతం జీతం పెంచేలా చర్యలు తీసుకోవాలని ఉద్యోగులు కోరుతున్నారు.










