కడప అర్బన్ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా ప్రభుత్వ విద్యారంగాన్ని నిర్వీర్యం చేసి కార్పోరేట్ విద్యాసంస్థలను పెంచి పోషిస్తున్నాయని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షులు ప్రసన్నకుమార్ పేర్కొన్నారు. నగరంలోని ప్రెస్‌క్లబ్‌లో భారత విద్యార్థి ఫెడరేషన్ జిల్లా ప్లీనరీ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం నూతన జాతీయ విద్యా విధానాన్ని తీసుకువచ్చి పూర్తిగా ప్రభుత్వ విద్యారంగాన్ని నిర్వీర్యం చేస్తుందన్నారు. నూతన జాతీయ విద్యా విధానాన్ని అమలు చేయడం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని పేద విద్యార్థులు విద్యకు దూరమయ్యే ప్రమాదం ఉందన్నారు. రాష్ట్రంలోని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రోజుకొక జీఓ తీసుకువచ్చి విద్యారంగాన్ని విచ్ఛిన్నం చేస్తుందన్నారు. పేద విద్యార్థులను ఉన్నత విద్యకు దూరం చేసేలా జీఓ నెంబర్ 77 తీసుకువచ్చి పీజీ చదివే విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ ఆపేసిందన్నారు. అనేక షరతులు పెట్టి జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన, అమ్మ ఓడి నిధులన్ని పెండింగులో పెట్టి విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తు ందన్నారు. సంక్షేమ హాస్టల్ విద్యార్థులకు పెండింగ్‌లో ఉన్న మెస్, కాస్మొటిక్ ఛార్జీలు విడుదల చేయకుండా ఇబ్బందులు పెడుతు ందన్నారు. నూతనంగా ఏర్పాటైన మెడికల్ కలశాలల్లో 50 శాతం సీట్లను అమ్మకానికి పెట్టి విద్య వ్యాపారాన్ని చేస్తుందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న విద్యా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా మరిన్ని పోరాటాలకు విద్యార్థులు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో విద్యార్థి మాజీ నాయకులు చంద్ర శేఖర్, మాజీ జిల్లా కార్యదర్శి శివకుమార్, అన్వేష్, ఓబులేసు, నరసింహులు, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు నాయక్, సగిలి రాజేంద్ర ప్రసాద్, ఉపాధ్యక్షులు గండి సునీల్ కుమార్, సహాయ కార్యదర్శులు వినరు, రాహుల్ విద్యార్థులు కరిష్మా, వైష్ణవి, గీత, జిల్లా నాయకులు మనోజ్, అజరు, సుమంత్, రాజశేఖర్ పాల్గొన్నారు.










