Sep 26,2023 21:24

తిరుపతి కలెక్టరేట్‌ ఎదుట ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో నిరసన తెలుపుతున్న విద్యార్థులు

విద్యా రంగ సమస్యలు పరిష్కరించండి
కలెక్టరేట్‌ ఎదుట ఎస్‌ఎఫ్‌ఐ నిరసన
ప్రజాశక్తి - తిరుచానూరు
విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ''ఛలో కలెక్టరేట్‌'' కార్యక్రమం మంగళవారం జరిగింది. తిరుపతి జిల్లా కలెక్టరేట్‌ కార్యాలయం ముందు ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షులు రవి మాట్లాడుతూ నేటి ధరలకు అనుగుణంగా హాస్టల్‌ మెస్‌ చార్జీలు మూడువేల రూపాయలకు పెంచాలని, పెండింగ్‌లో ఉన్న కాస్మోటిక్‌ చార్జీలు విడుదల చేయాలని, గత నాలుగు సంవత్సరాలుగా విద్యార్థులు ఆందోళన చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం దుర్మార్గమైన చర్యన్నారు. తక్షణమే ప్రభుత్వ వసతి గహాలు లో సౌకర్యాల మెరుగుకు చొరవ తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్ర యూనివర్శిటీల స్వయం ప్రతిపత్తిని హరించి వేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి పీజీ ప్రవేశ పరీక్షతో పాటు డిగ్రీ ఆన్లైన్‌ విధానంను తీసుకుని వచ్చి విద్యార్థులు తాము చదవాలనుకున్న కోర్సు, కోరుకున్న ప్రాంతాల్లో రాకపోవడంతో అనేక మంది విద్యార్థులు చదువులకు స్వస్తి చెప్పడం లేదా వేరే రాష్ట్రాల కు వెళ్ళి చదువుకోవడం చేస్తున్నారని, అందుకు ఉదాహరణే గత మూడు సంవత్సరాలుగా మన రాష్ట్రంలో డిగ్రీ, పి.జి కోర్సుల్లో అడ్మిషన్లు గణనీయంగా తగ్గాయని ఆవేదన వ్యక్తం చేశారు. జిఓ 77 ను రద్దు చేసి ఉన్నత చదువులు చదివే అర్హులైన ప్రతి పేద విద్యార్థి కి విద్యా దీవెన, వసతి దీవెన పథకాలను వర్తింపజేయాలని కోరారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని జాయింట్‌ కలెక్టర్‌ డి.కె.బాలాజీకి అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షులు అక్బర్‌, నాయకులు హెచ్‌.శివ, వెంకటేష్‌, పునీత్‌, శివ, మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు.
తిరుపతి కలెక్టరేట్‌ ఎదుట ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో నిరసన తెలుపుతున్న విద్యార్థులు