
ప్రజాశక్తి- అనకాపల్లి
పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు మరింత మెరుగుపరిచే దిశగా ఉపాధ్యాయులు, అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ రవి పఠాన్ శెట్టి ఆదేశించారు. గురువారం గుండాల జంక్షన్ సచివాలయ సమావేశ మందిరంలో విద్యాశాఖ అధికారులు, ప్రధానోపాధ్యాయులతో జరిగిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. స్కూల్ ఆవరణ, తరగతి గదులలో ఆహ్లాదకర వాతావరణం ఉండేలా, పారిశుధ్యం - పరిశుభ్రత పక్కాగా అమలు జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఉపాధ్యాయులు విద్యాబోధనలో అవసరమైన మార్పులు చేసి విద్యార్థులలో జిజ్ఞాసను కలిగించడం, ఆసక్తి పెంచడం ద్వారా ప్రజ్ఞను వెలికి తీయాలని ఆదేశించారు. విద్యార్థులలో అవగాహన స్థాయిని తెలుసుకునేందుకు 3 నుంచి 10 వ తరగతి విద్యార్థులకు వారాంతపు పరీక్షలు నిర్వహించాలన్నారు. డిజిటల్ టెక్నాలజీ వినియోగం పెంచేందుకు తగు చర్యలు తీసుకోవాలని సూచించారు. రానున్న సంవత్సర పదవ తరగతి పరీక్షలలో నూరు శాతం ఉత్తీర్ణత లక్ష్యంగా పనిచేయాలన్నారు. బాల్య వివాహాలు, బాల కార్మికులు, ముందస్తు గర్భం మొదలైన వాటివల్ల జరిగే నష్టాలను తెలియజేస్తూ సాంఘిక విషయాలపై విద్యార్థులలో అవగాహన కలుగజేయాలని కోరారు. ఈ సమావేశంలో జిల్లా విద్యాశాఖ అధికారి వెంకట లక్ష్మమ్మ, ఏడి రవిబాబు, ఎంఇఒలు, ఏపీడబ్ల్యుఐడీసీ జెఇ ప్రసాద్, సర్వశిక్షా అభియాన్ ఈఈ నారాయణరావు, ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.