Nov 07,2023 01:12

మాట్లాడుతున్న కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌

ప్రజాశక్తి-పాడేరు: ప్రాథమిక స్థాయి నుండి విద్యా ప్రమాణాలు మెరుగు పరచాలని జిల్లా కలెక్టర్‌ సుమిత్‌ కుమార్‌ స్పష్టం చేసారు. కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో ప్రేరణ ఆధ్వర్యంలో పాడేరు, జి.మాడుగుల, చింతపల్లి మండలాల ప్రాధమిక పాఠశాలలు, కెజిబివి పాఠశాలలో విద్యా ప్రమాణాలపై నిర్వహించిన సర్వేపై ఎంఇఓలు, ప్రధానోపాధ్యాయులకు సోమవారం వర్కుషాపు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పిల్లలు పఠనా సామర్ధ్యాలలో వెనుకబడి ఉంటున్నారని చెప్పారు. ఉపాధ్యాయులు ఉదయం, సాయంత్రం విద్యార్దులతో మాట్లాడి పిల్లల పఠనా సామర్ధ్యాలు పరిశీలించి తగని విధంగా బోధన అందించాలని చెప్పారు. ప్రాధమిక స్థాయిలో సక్రమంగా బోధిస్తే మధ్యలో బడి మానరన్నారు. తెలుగు, ఆంగ్ల భాషా, చరిత్ర, గణితం బోధించాలని సూచించారు. విద్యార్ధులకు పరిశుభ్రతపై అవగాహన కల్పించాలని చెప్పారు. విద్యార్ధులతో ఉపాధ్యాయులు స్నేహ పూర్వక వాతావరణం ఉంటే మంచి ఫలితాలు వస్తాయన్నారు. కెజిబి పాఠశాలలో ఉన్న విద్యా ప్రమాణాలపై సంబంధిత ప్రధానోపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. పాఠ్యాంశాలు చదవడం, రాయడంపై ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో డిఇ ఓ గౌరీ శంకరరావు, గిరిజన సంక్షేమ శాఖ ఉప సంచాలకులు ఐ.కొండలరావు, ప్రేరణ ప్రోగ్రాం మేనేజర్‌ జి.నారాయణరావు, ఎంఇఓలు రామచంద్రరావు, సరస్వతి, పాడేరు, జి.మాడుగుల, చింతపల్లి మండలాలకు చెందిన ప్రధానోపా ధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.