ప్రజాశక్తి - పల్నాడు జిల్లా : విద్యార్థులలో చదువుకు తగ్గ ప్రమాణాలు ఉండేలా చర్యలు తీసుకుంటామని పల్నాడు జిల్లా విద్యాశాఖ అధికారి కె.శామ్యూల్ అన్నారు. ఈ విద్యా సంవత్సరంలోనే ప్రమాణాలు పెంచేందుకు ప్రణాళిక రూపొందించామని, పాఠశాలలపై పర్యవేక్షణ పెంచుతామని చెప్పారు. పదో తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించేందుకు విద్యా సంవత్సరం ప్రారంభం నుంచే ప్రత్యేక దృష్టి సారించామన్న ఆయన జిల్లాలో విద్యారంగంలో చేపట్టిన పలు అంశాలపై ప్రజాశక్తికి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు.
ప్రభుత్వ విద్య బలోపేతానికి తీసుకుంటున్న చర్యలేమిటి?
ప్రభుత్వ విద్యా వ్యవస్థ బలోపేతానికి విద్యాశాఖ అనేక చర్యలు చేపట్టింది. నాడు-నేడు కార్యక్రమం ద్వారా పాఠశాలలో మౌలిక సదుపాయాల కల్పిస్తున్నాం. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా అదనపు తరగతి గదుల నిర్మాణం, మినరల్ వాటర్ సదుపాయం, మరుగుదొడ్లు వంటివి ఏర్పాటు చేస్తున్నాం. జగనన్న విద్యా కానుక (జెవికె) కిట్ కింద పుస్తకాలు, బ్యాగ్, బూట్లు, యూనిఫాం అందిస్తోంది. గోరుముద్ద పథకం కింద పోషకాహారం అందిస్తోంది. ఇవన్నీ తల్లిదండ్రులు గుర్తించాలి. తమ పిల్లల్ని ప్రైవేటు, కార్పొరేటు పాఠశాలల్లో చేర్పించి ఫీజుల దోపిడీకి గురికాకుండా ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలి.
నాడు-నేడు పనుల పురోగతి ఎలా ఉంది?
నాడు-నేడు మొదటి విడత 100 శాతం పూర్తయ్యింది. రెండో విడత కింద ఎంపిక చేసిన 547 ప్రభుత్వ పాఠశాలల్లో పనులు చివరి దశకు చేరుకున్నాయి. 20 నుండి 30 రోజుల్లోపు ఆ పనులన్నీ నూరుశాతం పూర్తవుతాయి. వీటికి సంబంధించి సంబంధిత అధికారులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నాం. జిల్లా వ్యాప్తంగా 174 పాఠశాలల్లో 746 అదనపు తరగతి గదుల నిర్మాణ పనులు వేగవంతంగా జరుగుతున్నాయి.
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య ఎలా ఉంది?
పల్నాడు జిల్లాలో ఉన్న వివిధ ప్రభుత్వ పాఠశాలల్లో 2,97,567 మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరిలో 9,607 మంది కెజివిబి, మోడల్ స్కూల్‌లో ఉండగా జెడ్‌పి హైస్కూల్స్, ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో 1,28,765 మంది ఉన్నారు. వీరిలో బాలికలు 66,038 మంది ఉండగా బాలురు 62,727 మంది ఉన్నారు. ప్రయివేటు ఎయిడెడ్, కేంద్రీయ విద్యాలయ, నవోదయ, మదర్సా, బిసి ఎస్సీ, ఎస్టీ సంక్షేమ పాఠశాలల్లో 1,37,732 మంది చదువుతున్నారు.
కెజిబివి, మోడల్ స్కూల్‌లో చేరికలు, పని తీరు ఎలా ఉంది?
ఆయా పాఠశాలల్లో సీట్లు 100 శాతం భర్తీ అయ్యాయి. పల్నాడు జిల్లాలో కస్తూర్బా గాంధీ బాలికల వసతిగృహాలు 24 ఉండగా అందులో 4325 మంది బాలికలు ఉండగా అదేవిధంగా మోడల్ స్కూల్‌లో 5282 మంది విద్యనభ్యసిస్తున్నారు. కెజిబివిలలో ఇటీవల 98 అధ్యాపకుల పోస్టులను భర్తీ చేశాం. 6వ తరగతి 12వ తరగతి వరకు ఉపాధ్యాయులను నియమించి కొరతను అధిగమించాం.
పాఠ్యపుస్తకాలు పూర్తిగా అందలేదనే విమర్శలున్నాయి కదా?
మొదటి విడత పుస్తకాలను 100 శాతం పంపిణీ చేశాం. 2వ విడత పుస్తకాలను ఈ నెల 18 వ తేదీ నాటికి పాఠశాలలకు చేరుస్తాం. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఈ నెల 22న పుస్తక దినోత్సవం సందర్భంగా 4.85 లక్షల పుస్తకాలు పంపిణీ చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశాం.
జెవికె కిట్ల పంపిణీ ఎంత వరకు పూర్తయింది?
విద్యా కానుక కిట్లకు సంబంధించి 93.81 శాతం పూర్తి చేశాం. మిగతవావారికీ ఇచ్చినా కొలతలు సరిపోక రిటర్న్ పంపించాం. కాబట్టి 100 శాతం పిల్లలకు ఇచ్చినట్లు బయోమెట్రిక్ తీసుకున్నాం. రిటర్న్ పంపినవి రాగానే వాటినీ విద్యార్థులకు అందజేస్తాం.
గోరుముద్ద అమలు ఎలా ఉంది?
నిర్దేశించిన మెనూను తప్పనిసరిగా అమలయ్యేలా ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తున్నాం. నిర్వాహకులకు ప్రతినెలా 6వ తేదీ లోగా బిల్లులు చెల్లిస్తున్నాం. గోరుముద్ద పథకంలో భాంగంగానే ఉదయం పూట రాగిజావను అందిస్తున్నాం. పథకం అమలులో లోపాలున్నా, ఫిర్యాదులు వచ్చినా సహించబోం. తప్పులుంటే కఠిన చర్యలు తీసుకుంటాం..
ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల నిర్వహణపై పరిశీలన?
ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల్లో ఆకస్మిక తనిఖీలు చేస్తాం. నిబంధనలు పాటించని యాజమాన్యాలపై చర్యలు తీసుకుంటాం. పుస్తకాలను అధిక ధరల అమ్మడంపైన, ఫీజుల అధికంగా వసూలు చేయడంపైన ఆధారాలు సహా తమను ఎవరైనా సంప్రదిస్తే ఆయా పాఠశాలల యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకుంటాం. ఆయా సంస్థలు సైతం ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ జిల్లాలో విద్యాభివృద్ధికి తమ వంతు పాత్ర పోషించాలి. పిల్లలను బస్సుల్లో పాఠశాలలకు తీసుకెళ్లే అంశంలో పాఠశాల యాజమాన్యం చాలా జాగ్రత్తగా ఉండాలి. డ్రైవర్లను అప్రమత్తంగా ఉంచుతూ ప్రమాదాల తావివ్వకుండా చూడాలి. ఓ ప్రైవేటు పాఠశాల బస్సు ఇటీవల ప్రమాదానికి గురైన నేపథ్యంలో రూ.2 లక్షలు జరిమానా విధించాం.
పేదలకు 25 శాతం ఉచిత విద్య అమలవుతోందా?
దీనికి సంబంధించి ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలకు దిశానిర్దేశం చేశాం. జిల్లా వ్యాప్తంగా ఆన్‌లైన్‌లో 470 దరఖాస్తులు రాగా 200 మంది విద్యార్థులకు పైగా అడ్మిషన్ల ప్రక్రియ పూర్తయింది. మిగిలిన వారికి కూడా ఈ వారంలో చేరికల ప్రక్రియ పూర్తి చేస్తాం.










