Aug 28,2023 20:52

.లబ్ధిదారులకు చెక్‌ను అందజేస్తున్న కలెక్టర్‌ గిరీష

రాయచోటి : పేద విద్యార్థులు జగనన్న విద్యాదీవెనను సద్వినియోగం చేసుకుని ఉన్నత స్థానాలకు చేరుకోవాలని కలెక్టర్‌ గిరీష పేర్కొన్నారు. సోమవారం చిత్తూరు జిల్లా నగరి బహిరంగ వేదిక నుంచి 2023 జగనన్న విద్యా దీవెన పథకం సంబంధించి అర్హులైన తల్లుల బ్యాంకు ఖాతాలకు నగదు జమ చేసే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి బటన్‌ నొక్కి ప్రారంభించారు. కలెక్టరేట్‌లోని విసి హాలు నుంచి కలెక్టర్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో 34,568 మంది విద్యార్థులకు గాను అర్హులైన 31,743 మంది తల్లుల ఖాతాలలో రూ.24.42 కోట్లు జమ చేశారన్నారు. పేదరికం కారణంగా ఏ విద్యార్థి ఉన్నత చదువులకు దూరం కాకూడదని జగనన్న విద్యాదీవెనను రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిందాన్నారు. ఈ పథకం కింద ఐటిఐ, పాలిటెక్నిక్‌, డిగ్రీ, ఇంజినీరింగ్‌, మెడిసిన్‌ తదితర కోర్సులు చదివే అర్హులైన పేద విద్యార్థులు కళాశాలలకు చెల్లించాల్సిన పూర్తి ఫీజుల మొత్తాన్ని ప్రభుత్వమే భరిస్తోందన్నారు. క్రమం తప్పకుండా ఏ త్త్రెమాసికానికి ఆ త్క్రెమాసికం ముగిసిన వెంటనే విద్యార్థుల తల్లుల ఖాతాల్లో ఫీజుల మొత్తాలను నేరుగా రాష్ట్ర ప్రభుత్వం జమ చేస్తోంది. కళాశాలలో జవాబుదారీతనం పెరిగేలా, విద్యార్థుల తల్లులకు ప్రశ్నించే హక్కు కల్పిస్తూ, తల్లుల సాధికారతకు పట్టం కడుతూ నేరుగా వారి ఖాతాల్లోనే రాష్ట్ర జమ చేస్తోందన్నారు. అందులో ఎస్‌సి సంక్షేమం కింద 4,771 మంది విద్యార్థులు ఉండగా, 4,428 మంది తల్లి ఖాతాలల్లో రూ.3.22 కోట్లు, ఎస్‌టి సంక్షేమం కింద 1,170 మంది విద్యార్థులు ఉండగా, 1,068 మంది తల్లి ఖాతాలల్లో రూ.85.17 లక్షలు, బిసి సంక్షేమం కింద 13,699 మంది విద్యార్థులు ఉండగా, 12, 308 మంది తల్లి ఖాతాలల్లో రూ.9.39 కోట్లు, ఈబిసి కింద 4,398 మంది విద్యార్థులు ఉండగా, 4,180 మంది తల్లి ఖాతాలల్లో రూ.4.00 కోట్లు, ముస్లిం మైనారిటీ కింద 5,167 మంది విద్యార్థులు ఉండగా, 4,739 మంది తల్లి ఖాతాలల్లో రూ.3.16 కోట్లు, కాపు సంక్షేమం కింద 5,293 మంది విద్యార్థులు ఉండగా, 4,960 మంది తల్లి ఖాతాలల్లో రూ.3.73 కోట్లు, క్రిస్టియన్‌ మైనారిటీ కింద 70 మంది విద్యార్థులు ఉండగా, 60 మంది తల్లి ఖాతాలల్లో రూ.5.28 లక్షలు జమ చేశారని వివరించారు. అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకుని బాగా చదువుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని వారు ఆకాంక్షించారు. అనంతరం మెగా చెక్కును విద్యార్థుల తల్లులకు కలెక్టర్‌ అందజేశారు. కార్యక్రమంలో జిల్లా ఎస్సీ సంక్షేమ, సాధికారతాధికారి జాకీర్‌ హుస్సేన్‌, జిల్లా బిసి వెల్ఫేర్‌ ఆఫీసర్‌ సందప్ప, జిల్లా విధమైన సంక్షేమ అధికారులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.