ప్రజాశక్తి -పాడేరు:విద్యార్థులు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న విద్యా దీవెనను సద్వినియోగం చేసుకుని ఉన్నతంగా చదువుకోవాలని జిల్లా కలెక్టర్ సుమిత కుమార్ సూచించారు. బుధవారం రాష్ట్ర ముఖ్యమంత్రి తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు నుండి ప్రారంభించిన జగనన్న విద్యా దీవెన కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారాన్ని కలెక్టర్ కార్యాలయపు సమావేశ మందిరం నుండి లబ్ధిదారులతో కలిసి వీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ. రాష్ట్ర ప్రభుత్వం ఎఎస్‌ఆర్ జిల్లాలో 13 వేల 558 మంది విద్యార్ధినీ, విద్యార్థులకు రూ.7 కోట్ల 27 లక్షల 66 వేల 636లను విద్యార్థుల తల్లుల ఖాతాలకు జమ చేయడం జరిగిందన్నారు. ప్రభుత్వ ఆశయాల మేరకు ప్రతీ విద్యార్థి ఉన్నతంగా చదువు కోవాలని సూచించారు. గిరిజన సంక్షేమ శాఖ ద్వారా 11,612 మంది గిరిజన విద్యార్థులకు రూ. 5 కోట్ల 78 వేలు, సాంఘిక సంక్షేమ శాఖ ద్వారా 16 మంది ఎస్సీ విద్యార్థులకు 1 లక్ష 90వేలు, వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ద్వారా 1431 మంది బిసి విద్యార్థులకు రూ 1.కోటి 4 లక్షలు, 143 మంది ఇబిసిలకు 15 లక్షల 67 వేలు, 296 మంది కాపు విద్యార్థులకు రూ.21 లక్షల 77 వేలు, మైనారిటీ సంక్షేమ శాఖ ద్వారా 11 మంది క్రిష్టయన్ విద్యార్థులకు రూ.1 లక్ష 64 వేలు, 49 మంది ముస్లిం మైనారిటీల విద్యార్ధులకు రూ.4 లక్షలు జమ చేయడం జరిగిందన్నారు.ఈ సమావేశంలో ట్రైకార్ చైర్మన్ శతక బుల్లిబాబు, గిరిజన సంక్షేమ శాఖ ఉప సంచాలకులు ఐ.కొండలరావు, ఎంపిపి సోనారి రత్నకుమారి, ట్రైకార్ డైరెక్టర్ సుమర్ల సరస్వతి, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.










