విద్యా దీవెనను సద్వినియోగించుకోవాలి
- విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రు. 24.52 కోట్లు జమ
- జిల్లా కలెక్టర్ మనజీర్ జిలానీ సామూన్
ప్రజాశక్తి - నంద్యాల కలెక్టరేట్
జగనన్న విద్యా దీవెనను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ మనజీర్ జిలానీ సామూన్ తెలిపారు. జగనన్న విద్యా దీవెన కింద ఏప్రిల్-జూన్ 2023 త్రైమాసికానికి 34,879 మంది విద్యార్థులకు సంబంధించి 31,494 మంది తల్లుల ఖాతాల్లో రు. 24.52 కోట్లు జమ చేసినట్లు చెప్పారు. సోమవారం రాష్ట్రంలోని చిత్తూరు జిల్లా నగరి బహిరంగ వేదిక నుంచి జగనన్న విద్యా దీవెన పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా 8,44,336 మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ. 680.44 కోట్లను కంప్యూటర్ బటన్ నొక్కి నేరుగా జమ చేసే కార్యక్రమాన్నిముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు. నంద్యాల తకలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో జగనన్న విద్యా దీవెన వర్చువల్ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ మనజీర్ జిలానీ సామూన్, ఉమ్మడి జిల్లా పరిషత్ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి, మైనారిటీ సంక్షేమ అభివృద్ధి సలహాదారు హబీబుల్లా, సంక్షేమ శాఖ డిడి చింతామణి, విద్యార్థులు, విద్యార్థుల తల్లులు తదితరులు వీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని ఆళ్లగడ్డ నియోజకవర్గంలో 5,981 మంది విద్యార్థుల తల్లులకు రూ.4.16 కోట్లు, బనగానపల్లిలో 6,238 మంది విద్యార్థుల తల్లులకు రూ.4.36 కోట్లు, డోన్‌లో 5,002 మంది విద్యార్థుల తల్లులకు రూ.3.39 కోట్లు, నందికొట్కూర్‌లో 5,316 మంది విద్యార్థుల తల్లులకు ర.3.54 కోట్లు, నంద్యాలలో 5,896 మంది విద్యార్థుల తల్లులకు రూ.4.60 కోట్లు, పాణ్యంలో 1,803 మంది విద్యార్థుల తల్లులకు రూ.1.29 కోట్లు, శ్రీశైలంలో 4,643 మంది విద్యార్థుల తల్లులకు రూ.3.14 కోట్లు నేరుగా జమ చేశామని వివరించారు. ఉమ్మడి జిల్లా పరిషత్ చైర్మన్ మాట్లాడుతూ ప్రభుత్వం ఇస్తున్న ఆర్థిక సహాయాన్ని పేద విద్యార్థులు సద్వినియోగం చేసుకొని చదువులో రాణించాలన్నారు. చదువుల ఖర్చుతో తల్లిదండ్రులు అప్పులపాలు కాకూడదన్న సమున్నత లక్ష్యంతో జగనన్న విద్యాదీవెన పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిందన్నారు. అనంతరం ముఖ్య అతిథుల చేతుల మీదుగా విద్యార్థులు, విద్యార్థుల తల్లులకు మెగా చెక్కును అందజేశారు.










