Nov 20,2023 21:41

డిఆర్‌ఒకు వినతిపత్రం అందజేస్తున్న ఎస్‌ఐఎఫ్‌ నాయకులు

* 'స్పందన'లో ఎస్‌ఎఫ్‌ఐ వినతి
ప్రజాశక్తి - శ్రీకాకుళం ప్రతినిధి: 
జగనన్న విద్యా కానుక, వసతి దీవెన పథకాలకు జాయింట్‌ ఖాతా ఉత్తర్వులను రద్దు చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ ఉపాధ్యక్షులు డి.చందు, శ్రీకాకుళం టౌన్‌ కమిటీ సభ్యులు నితిన్‌, జి.గోవర్థన్‌ కోరారు. నగరంలోని జెడ్‌పి సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన స్పందన కార్యక్రమానికి 220 వినతులు వచ్చాయి. జాయింట్‌ కలెక్టర్‌ ఎం.నవీన్‌ అర్జీలను స్వీకరించారు. రెండు పథకాలకు ప్రారంభం నుంచి తల్లి ఖాతాలో నిధులు జమ చేస్తున్నారని, ఇప్పుడు జాయింట్‌ అకౌంట్‌ చేయడం వల్ల వచ్చే ప్రయోజనమేదీ కనిపించడం లేదన్నారు. పథకాల్లో కోత పెట్టేందుకే ప్రభుత్వం ఈ నిబంధన తీసుకొచ్చిందని తెలిపారు. పథకాల కింద చెల్లించాల్సిన రూ.1600 కోట్లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. కోటబొమ్మాళిలో అంబేద్కర్‌ ఆడిటోరియం నిర్మాణానికి అనుమతులు మంజూరు చేయాలని డా.బి.ఆర్‌ అంబేద్కర్‌ సేవా సమితి సభ్యులు బోకర జడ్డెన్న, శిమ్మయ్య, డి.సింహాచలం కోరారు. కొత్తూరు మండలంలో సుమారు 200 మంది కళాకారులు పలురకాల కళలు నేర్చుకోవడం, సాధన చేయడానికి మండల పరిధిలో కళాకారుల సామాజిక భవన నిర్మాణానికి స్థలం కేటాయించాలని కళాకారుల తరుపున అంపిలి ప్రశాంతకుమార్‌ కోరారు. కంచిలి మండలం పెద్ద శ్రీరాంపురంలో పోలింగ్‌ బూత్‌ నంబర్‌ 150లో 49, 151లో 29 మంది అర్హులైన ఓటర్లను తొలగించారని మాజీ సర్పంచ్‌ మాదిన రామారావు ఆధ్వర్యాన గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. పాతపట్నం మేజర్‌ పంచాయతీ అభివృద్ధి కోసం ఇస్తున్న నిధులను సక్రమంగా వినియోగించడం లేదని, గ్రామసభల్లో అధికారులు సరిగా సమాధానమూ చెప్పడం లేదని, దీనిపై సమగ్ర విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని వైసిపి మండల నాయకులు బి.నారాయణమూర్తి ఫిర్యాదు చేశారు.
స్పందనకు వస్తున్న అర్జీలను అధికారులు నిర్దేశిత సమయంలో పరిష్కారం చూపాలని జాయింట్‌ కలెక్టర్‌ ఎం.నవీన్‌ అన్నారు. అర్జీదారులకు అధికారులు ఇచ్చిన సమాధానంతో సంతృప్తి చెందకే ఆర్జీలు రీఓపెన్‌ అవుతున్నాయన్నారు. రీఓపెన్‌ అర్జీలను ఆయా అధికారులు తక్షణమే పరిష్కరించాలని కోరారు. స్పందన ద్వారా అర్జీదారులు ప్రయోజనం పొందాలన్నారు. ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం అమలు చేస్తున్న పలు సంక్షేమ పథకాలు, రెవెన్యూ, పౌర సరఫరాల సేవలు, నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు పథకం కింద పట్టాల పంపిణీ, ఇళ్ల మంజూరు, పెన్షన్లు, సర్వే, ఉపాధి అవకాశాలు, భూ వివాదాలు తదితర శాఖలకు సంబంధించిన అర్జీలు వచ్చాయి. వీటిలో నిషిద్ధ భూములకు సంబంధించి, భూ కేటాయింపులు, సమస్యలపై అధికంగా వచ్చాయి. సహాయ కలెక్టర్‌ రాఘవేంద్ర మీనా, ప్రత్యేక ఉప కలెక్టర్‌ జి.జయదేవి, జిల్లా రెవెన్యూ అధికారి ఎం.గణపతిరావు, జిల్లా పరిషత్‌ ముఖ్య కార్యనిర్వహణ అధికారి ఆర్‌.వెంకట్రామన్‌, హౌసింగ్‌ పీడీ ఎన్‌.గణపతి, జిల్లా ఉద్యానవన అధికారి ఆర్‌.వి వరప్రసాదరావు, జిల్లా సరఫరాల అధికారి డి.వి రమణ తదితరులు పాల్గొన్నారు.