Sep 12,2023 21:12

బటన్‌ నొక్కి15 రోజులు గడిచినా ఖాతాల్లోకి రాని సొమ్ము
ఫీజులు కట్టేందుకు తల్లిదండ్రులు నానావస్థలు
రెండు జిల్లాల్లోనూ 63,847 మంది విద్యార్థులు
ఇప్పటి వరకూ ఎంతమందికి జమైందో తెలియని అయోమయం
ఇలాగైతే ఎలాగంటూ తల్లిదండ్రులు తీవ్ర అసంతృప్తి
ప్రజాశక్తి - ఏలూరు ప్రతినిధి
విద్యార్థులకు అందించే ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు సంబంధించిన విద్యాదీవెన సొమ్ము విద్యార్ధులకు సకాలంలో అందడం లేదు. దీంతో కాలేజీ యాజమాన్యాల ఒత్తిడితో ఫీజులు చెల్లించేందుకు విద్యార్థుల తల్లిదండ్రులు నానావస్థలు పడుతున్నారు. విద్యాదీవెన సొమ్ముకు సంబంధించి ఆగస్టు 28వ తేదీన సిఎం చిత్తూరు జిల్లా నగరిలో జరిగిన సభలో బటన్‌ నొక్కారు. ఇది జరిగి 15 రోజులు గడిచినా ఇప్పటికీ విద్యా దీవెన సొమ్ము జమ కాకపోవడంతో తల్లిదండ్రుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. విద్యాదీవెన అందుకునే విద్యార్థులు ఏలూరు జిల్లాలో 31,859 మంది, పశ్చిమగోదావరి జిల్లాలో 31,188 మంది మొత్తం 63,867 మంది ఉన్నారు. ఏప్రిల్‌ నుంచి జూన్‌ త్రైమాసికానికి సంబంధించిన విద్యాదీవెన సొమ్మును ప్రభుత్వం విడుదల చేసింది. ఏలూరు జిల్లాలో రూ.25.37 కోటు,్ల పశ్చిమగోదావరి జిల్లాలో రూ.25.53 కోట్లు మొత్తం రూ.50.90 కోట్లు సొమ్ము జమ కావాల్సి ఉంది. రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకూ సగం మంది విద్యార్థులకూ సొమ్ము జమ కాలేదని తెలుస్తోంది. ఎంతమందికి జమైందో కూడా తెలియని అయోమయం నెలకొంది. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ సొమ్ము సకాలంలో జమ కాకపోవడంతో విద్యార్థుల తల్లిదండ్రులు గ్రామ సచివాలయాలకు వెళ్లి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. త్వరలోనే జమవుతాయంటూ సచివాలయ ఉద్యోగులు సర్ధిచెప్పి పంపిస్తున్న పరిస్థితి ఉంది. గతంలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు సంబంధించిన సొమ్ము ప్రభుత్వం నేరుగా కాలేజీలకు చెల్లించేది. దీంతో ప్రభుత్వం, కాలేజీ యాజమాన్యాల మధ్యే ఈ వ్యవహారం సాగేది. వైసిపి ప్రభుత్వం వచ్చాక ఫీజురీయింబర్స్‌మెంట్‌ చెల్లింపులకు సంబంధించి విద్యాదీవెన పథకం తెచ్చింది. విద్యా సంవత్సరానికి సంబంధించిన ఫీజు సొమ్మును నాలుగు విడతలుగా విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేస్తోంది. మొదట్లో సిఎం బటన్‌ నొక్కిన ఒకటి, రెండు రోజుల్లో విద్యాదీవెన సొమ్ము విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి చేరేవి. తల్లిదండ్రులు వెంటనే కాలేజీలకు చెల్లించేవారు. గడిచిన ఏడాదిగా విద్యాదీవెన సొమ్ముకు సంబంధించిన సిఎం బటన్‌ నొక్కినా రోజులు, నెలలు తరబడి సొమ్ము జమ కావడం లేదు. విద్యాదీవెన సొమ్మును ప్రభుత్వం విడుదల చేసింది కాబట్టి వెంటనే చెల్లించాలంటూ కాలేజీ యాజమాన్యాలు విద్యార్థులపై ఒత్తిడి చేస్తున్నాయి. సొమ్ము జమ కాలేదని చెప్పినా విన్పించుకోవడం లేదు. తర్వాత జమవుతాయని, మీరు చెల్లించాలంటూ హుకుం జారీ చేస్తున్నాయి. దీంతో సామాన్య కుటుంబాలు పిల్లల ఫీజు కోసం నానావస్థలు పడుతున్నారు. విద్యాదీవెన ఒక్కటే కాదు, వసతిదీవెన సొమ్ము పరిస్థితీ ఇదేవిధంగా మారింది. ఫీజు సొమ్ము సకాలంలో ప్రభుత్వం జమ చేయకపోవడంతో విద్యార్థుల తల్లిందండ్రుల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. అమ్మఒడి సొమ్ము సైతం ఇదేవిధంగా జమ కాకపోవడంతో తల్లిదండ్రులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన విషయంలోనూ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విద్యాదీవెన సొమ్ము ఎప్పటికి జమవుతుందో సరైన సమాధానం చెప్పేవారే లేకపోవడంతో తల్లిదండ్రుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. విద్యాదీవెన సొమ్ము వెంటనే జమ చేయాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.