ప్రజాశక్తి - కాకినాడ
రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్య రంగాలకు అత్యంత ప్రాధాన్యమిస్తోందని పేద కుటుంబాల విద్యార్థులకు సైతం ఉన్నత విద్యను దగ్గర చేసేందుకు జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన తదితర పథకాలను అమలుచేస్తోందని కాకినాడ ఎంపి వంగా గీత అన్నారు. 2023 జనవరి-మార్చి త్రైమాసికానికి సంబంధించి జగనన్న విద్యా దీవెన ఫీజు రీయింబర్స్‌మెంట్ మొత్తాన్ని నేరుగా విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమచేసే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తూర్పుగోదావరి జిల్లా, కొవ్వూరులో బుధవారం ప్రారంభించారు. ఈ నేపథ్యంలో కాకినాడ కలెక్టరేట్ వివేకానందహాల్‌లో జగనన్న విద్యా దీవెన జిల్లాస్థాయి కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి ఎంపి వంగా గీత, జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా, కుడా ఛైర్‌పర్సన్ రాగిరెడ్డి చంద్రకళాదీప్తి, ఇన్‌ఛార్జ్ డిఆర్‌ఒ కె.శ్రీరమణిలతో పాటు వివిధ కళాశాలల విద్యార్థులు, తల్లిదండ్రులు హాజరయ్యారు. ముఖ్యమంత్రి బటన్ నొక్కి నేరుగా విద్యార్థుల తల్లుల ఖాతాల్లో ఫీజు మొత్తాన్ని జమచేసిన అనంతరం ఎంపి గీత, కలెక్టర్ కలెక్టర్ కృతికా శుక్లా తదితరులు అధికారులతో కలిసి ఫీజు రీయింబర్స్‌మెంట్ మెగా చెక్‌ను విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎంపి వంగా గీత మాట్లాడుతూ మంగళవారం విడుదలైన యుపిఎస్‌సి ఫలితాల్లో మొదటి మూడు ర్యాంకులు అమ్మాయిలే సాధించారని, వారిని స్ఫూర్తిగా తీసుకోవాలని విద్యా ర్థులకు సూచించారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రుల తరఫున ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి ధన్యవాదాలు తెలియజేశారు.
రూ. 31.05 కోట్ల లబ్ధి : కలెక్టర్ కృతికా శుక్లా
కలెక్టర్ కృతికా శుక్లా మాట్లాడుతూ జగనన్న విద్యా దీవెన పథకం కింద 2023, జనవరి-మార్చి త్రైమాసికానికి కాకినాడ జిల్లాలో 37,787 మంది ఎస్‌సి, ఎస్‌టి, బిసి, ఈబిసి, కిస్టియన్, ముస్లిం మైనారిటీ, కాపు విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.31.05 కోట్లు జమవుతున్నట్లు తెలి పారు. విద్యా దీవెన, వసతి దీవెన తదితర పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.కార్యక్రమంలో బిసి సంక్షేమ అధికారి ఎస్‌విఎస్ సుబ్బలక్ష్మి, జిల్లా గిరిజన సంక్షేమ అధికారి ఎ.విజయశాంతి, సహాయ సాంఘిక సంక్షేమ అధికారి పిఎన్‌వి సత్యనారాయణ, వివిధ కళాశాలల విద్యార్థులు, తల్లిదండ్రులు హాజరయ్యారు.
విద్యార్థులకు త్రైమాసిక చెక్కును అందజేస్తున్న ఎంపి గీత, కలెక్టర్ కృతికా శుక్లా










