Apr 25,2023 00:42

పీజీ విద్యార్థుల వసతి గృహాలకు శంకుస్థాపన చేస్తునన మంత్రులు రజిని, వేణుగోపాలకృష్ణ

.... మంత్రి విడదల రజని
ప్రజాశక్తి - కాకినాడ
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేతత్వంలో రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్య రంగాలకు అత్యంత ప్రాధాన్యమిస్తోందని ఈ రెండు రంగాల్లో విప్లవాత్మక సంస్కరణలు ప్రవేశపెట్టినట్లు రాష్ట్ర ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం, వైద్య విద్య శాఖ మంత్రి విడదల రజని పేర్కొన్నారు. సోమవారం మంత్రి విడదల రజని కాకినాడలో పర్యటించారు. తొలుత జీజీహెచ్‌లోని వంగా గీత ఎమర్జన్సీ బ్లాక్‌ను రాష్ట్ర బీసీ సంక్షేమం, సమాచార, పౌర సంబంధాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, ఎంపి వంగా గీత, కలెక్టర్‌ కృతికా శుక్లా, కాకినాడ అర్బన్‌ ఎంఎల్‌ఎ ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డిలతో కలిసి అక్కడ రోగులకు అందుతున్న వైద్య సేవలను పరిశీలించారు. అనంతరం జీజీహెచ్‌ ప్రాంగణంలో ఆగిపోయిన మాతృ, శిశు ఆరోగ్య కేంద్రాన్ని (ఎంసీహెచ్‌ బ్లాక్‌) సందర్శించారు. కాకినాడ అర్బన్‌, 38వ డివిజన్‌, గాంధీనగర్‌లో రూ. 80 లక్షలతో నిర్మించిన డాక్టర్‌ వైఎస్సార్‌ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి ప్రారంభించారు. రాంకోసా హౌం పక్కన రూ. 55.20 కోట్ల వ్యయంతో చేపట్టనున్న రంగరాయ మెడికల్‌ కాలేజీ పీజీ బాలురు, బాలికల వసతి గృహాలకు మంత్రి విడదల రజని ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం కాకినాడ జీజీహెచ్‌లో చేపట్టిన మాతృ, శిశు ఆరోగ్య కేంద్రం భవనాన్ని పూర్తిచేసేందుకు రంగరాయ మెడికల్‌ కాలేజ్‌ అలుమ్ని ఆఫ్‌ నార్త్‌ అమెరికా (ఆర్‌ఎంసీఏఎన్‌ఏ) రూ.42 కోట్లతో ముందుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వంతో ఎంఒయు కుదుర్చుకుంది. ఈ మొత్తంలో అధిక మొత్తాన్ని విరాళంగా అందించి ముఖ్యదాతగా నిలిచిన ఆర్‌ఎంసి రెండో బ్యాచ్‌ విద్యార్థి, ప్రముఖ వైద్యులు డాక్టర్‌ ఎన్‌.ఉపేంద్రనాథ్‌ను ఆర్‌ఎంసీ ఆడిటోరియంలో మంత్రి విడుదల రజని, మంత్రులతో కలిసి సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి రజని మాట్లాడుతూ రూ. 3,800 కోట్లతో ప్రస్తుతమున్న వైద్య కళాశాలలను అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. అదే విధంగా కొత్త వైద్య కళాశాలల ఏర్పాటుకు రూ. 8,500 కోట్ల మేర ఖర్చు చేయనున్నట్లు వెల్లడించారు. త్వరలోనే తొలివిడతలో ప్రాధాన్యమున్న అయిదు కొత్త మెడికల్‌ కళాశాలల్లో 750 ఎంబీబీఎస్‌ సీట్లకు ప్రవేశాలు ప్రారంభించనున్నట్లు మంత్రి విడదల రజని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం నాడు-నేడు ద్వారా పాఠశాలలు, కళాశాలలు, ఆసుపత్రుల రూపురేఖలను సమూలంగా మార్చుతోందన్నారు. ఆయా కార్యక్రమాల్లో రాజానగరం ఎంఎల్‌ఎ జక్కంపూడి రాజా, కుడా ఛైర్‌పర్సన్‌ రాగిరెడ్డి చంద్రకళాదీప్తి, కాకినాడ నగర పాలక సంస్థ కమిషనర్‌ ఆర్‌.మహేష్‌ కుమార్‌, మాజీ మేయర్‌ సుంకర శివ ప్రసన్న, డైరెక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌, ఆర్‌ఎంసీ ప్రిన్సిపల్‌ డాక్టర్‌ డిఎస్‌విఎల్‌ నరసింహం, డింఎహెచ్‌వో డాక్టర్‌ ఆర్‌.రమేష్‌, జిజిహెచ్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ హేమలతాదేవి, ఆర్‌ఎంసిఎన్‌ఎ స్థానిక సమన్వయకర్త డాక్టర్‌ లక్ష్మీనారాయణ, డాక్టర్‌ కళ్యాణ చక్రవర్తి, డాక్టర్‌ వాడ్రేవు రవి, విద్యార్థులు పాల్గొన్నారు.