Jul 26,2023 21:52

ఏరియా ఆస్పత్రి భవన నిర్మాణాలను పరిశీలిస్తున్న డిప్యూటీ సిఎం రాజన్నదొర

ప్రజాశక్తి - సాలూరు : రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేనివిధంగా విద్య, వైద్య రంగాలకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు డిప్యూటీ సిఎం పి.రాజన్నదొర చెప్పారు. బుధవారం ఆయన నిర్మాణంలో వందపడకల ఆసుపత్రి పనులను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం ఏరియా ఆసుపత్రిలో వసతి సమస్య ఉందని, దీనివల్ల ఒక బెడ్‌పై ఇద్దరు, ముగ్గురు రోగులను ఉంచాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. డిసెంబర్‌ నాటికి ఆసుపత్రి అందజేయాలని కాంట్రాక్టరును కోరామని, దీనికి సంసిద్ధత వ్యక్తం చేశారని చెప్పారు. రోజువారీ అవుట్‌ పేషెంట్ల సంఖ్య గతం కంటే బాగా పెరిగిందని చెప్పారు. ఇటీవల నిర్వహించిన నియోజకవర్గ సమీక్షలో పాచిపెంట పిహెచ్‌సిని సిహెచ్‌సిగా అప్‌ గ్రేడ్‌ చేయాలని ప్రతిపాదించినట్లు తెలిపారు. సాలూరు మండలం మామిడిపల్లి లేదా తోణాం పిహెచ్‌సిని సిహెచ్‌సిగా అప్‌ గ్రేడ్‌ చేయాలని యోచిస్తున్నట్లు చెప్పారు. ఈ ప్రతిపాదనలు అమలైతే గిరిజన రోగులకు మెరుగైన వైద్య సేవలు అందుతాయని చెప్పారు. గ్రామాల్లో ఏర్పాటు చేసిన వైఎస్సార్‌ హెల్త్‌ క్లినిక్‌ల్లోనూ వైద్య సేవలు అందుతున్నాయని చెప్పారు.
అభివృద్ధి కమిటీ సమావేశంలో ప్రతిపాదనలు
స్థానిక ఏరియా ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశం బుధవారం డిప్యూటీ సీఎం రాజన్నదొర అద్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో ఆసుపత్రికి అవసరమైన పరికరాలు, వస్తువుల కొనుగోలుకు ఆమోదించారు. ఆరోగ్య శ్రీ విభాగానికి ఒక కంప్యూటర్‌, ఆరోగ్య మిత్రులకు రోగుల సమాచారం భద్రపరచడానికి మరో కంప్యూటర్‌, ప్రింటర్‌ కొనుగోలు చేయాలని ప్రతిపాదించారు. చెవి, ముక్కు, గొంతు వైద్యానికి సంబంధించిన పరికరాలను కొనుగోలు నిర్ణయించారు. రోడ్డు ప్రమాదాల్లో తీవ్రంగా గాయపడిన అత్యవసర రోగులకు స్టెబిలైజ్‌ చేయడానికి అవసరమైన పరికరాలు కూడా కొనుగోలు చేయాలని ప్రతిపాదించారు. ఆపరేషన్‌ థియేటర్‌లో అవసరమైన టేబుల్స్‌ కొనుగోలు, లేబొరేటరీలో విద్యుత్‌ అంతరాయం వల్ల ఇబ్బంది లేకుండా ఇన్వెర్టర్‌, ఆపరేషన్‌ థియేటర్‌లో డాక్టర్లకు అవసరమైన డ్రెస్సులు, సిబ్బందికి అవసరమైన గౌనులు, రోగులకు డ్రెస్సులు కొనుగోలుకు ప్రతిపాదన చేశారు. ఇతర విభాగాల్లో అవసరమైన పరికరాలు, వస్తువుల కొనుగోలు కోసం ప్రతిపాదనలను కమిటీ సభ్యులు ఆమోదించారు. సమావేశంలో కమిటీ సభ్యులు డాక్టర్‌ బి.అప్పలనాయుడు, సూపరింటెండెంట్‌ డాక్టర్‌ వేణుగోపాల్‌, ఆర్‌ఎంఒ రత్నకుమారి, కమిషనర్‌ శంకరరావు, కౌన్సిలర్లు మాధవరావు, ఎస్‌.ఈశ్వరరావు, వైసిపి నాయకులు హరిబాలాజీ, చొక్కాపు గోపి పాల్గొన్నారు.