ప్రజాశక్తి-ఆలూరు
విద్య, ఉపాధి కల్పనలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం చెందాయని డివైఎఫ్‌ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.రామన్న తెలిపారు. శుక్రవారం ఆలూరులో భగత్ సింగ్ 116వ జయంతి సందర్భంగా డివైఎఫ్‌ఐ ఆధ్వర్యంలో విద్యార్థులతో కలిసి పట్టణంలో ప్రదర్శన చేపట్టారు. జూనియర్ కళాశాలలో 'విద్య, ఉపాధి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరి' అనే అంశంపై సదస్సు నిర్వహించారు. డివైఎఫ్‌ఐ మండల కార్యదర్శి మైనా అధ్యక్షత వహించారు. అంతకుముందు రామన్న ఆధ్వర్యంలో భగత్‌సింగ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. స్వాతంత్య్రం, దేశ ప్రజలకు స్వేచ్ఛను అందించేందుకు బ్రిటీష్ వారిని గడగడలాడించి 23 ఏళ్ల వయస్సులోనే ఉరికొయ్యను ముద్దాడి ప్రాణాలర్పించాడని తెలిపారు. ఆయన వెలిగించిన విప్లవ కాంతిని, ఆయన ఆశయాలను కొనసాగిస్తామని చెప్పారు. ప్రపంచంలోనే అత్యధికంగా యువకులు ఉన్న దేశంగా భారతదేశ ఉందని తెలిపారు. నేటి యువతకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చదువుకు తగిన ఉద్యోగాలు కల్పించడం లేదన్నారు. ప్రయివేటీకరణ పేరుతో ప్రభుత్వ రంగ సంస్థలను అదానీ, అంబానీలకు దోచిపెడుతోందని విమర్శించారు. వైసిపి ప్రభుత్వంలో ఒక్క డీఎస్సీ లేదని, గ్రూప్స్ నోటిఫికేషన్ లేదని తెలిపారు. కొత్త జాబ్ క్యాలెండర్ లేదన్నారు. రాష్ట్రంలోని యువత నిరుత్సాహంతో ఉద్యోగాలు రావన్న భ్రమలోకి వచ్చేశారన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు అర్థమయ్యేలా భవిష్యత్తులో ఉద్యమ పోరాటాలు ఉండాలని తెలిపారు. డివైఎఫ్‌ఐ మండల ఉపాధ్యక్షులు గోవర్ధన్, సహాయ కార్యదర్శి షఫీ, ఎస్‌ఎఫ్‌ఐ మండల అధ్యక్షులు పోతరాజు, మహేష్, బసవరాజు, గిరి మూర్తి, ధనంజయ పాల్గొన్నారు.
ర్యాలీ నిర్వహిస్తున్న నాయకులు, విద్యార్థులు










