
ప్రజాశక్తి - గుంటూరు, మంగళగిరి : ప్రభుత్వం ఆధ్వర్యంలో నాణ్యమైన విద్య, ఉపాధ్యాయుల హక్కుల కోసం మరొక పెద్ద ఉద్యమాన్ని నిర్మించాల్సిన అవసరం ఉందని యుటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఎన్.వెంకటేశ్వర్లు అన్నారు. యుటిఎఫ్ ఏర్పడి 50 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా చేపట్టిన స్వర్ణోత్సవ ప్రచార జాతా శుక్రవారం గుంటూరు జిల్లాలో పర్యటించింది. గుంటూరు, మంగళగిరిలో జాతాకు ఘన స్వాగతం లభించింది. గుంటూరు బ్రాడీపేటలోని సంఘం జిల్లా కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీనియర్ నాయకులు టి.అంజిరెడ్డి యుటిఎఫ్ పతాకాన్ని ఆవిష్కరించి, చెన్నుపాటి లక్ష్మయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అప్పారి వెంకటస్వామి చిత్రపటానికి యుటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఎన్.వెంకటేశ్వర్లు పూలమాల వేశారు. అనంతరం ప్రచార జాతాను ప్రచార జాతాను ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు జెండా ఊపి ప్రారంభించారు. జాతా గుంటూరు లాడ్జి సెంటర్, ఎన్టీఆర్ స్టేడియం, గుజ్జనుగుండ్ల సెంటర్ మీదుగా పాత ఆర్టిఓ ఆఫీస్ కలెక్టరేట్ దగ్గరకు చేరింది. కలెక్టరేట్ వద్ద యుటిఎఫ్ సీనియర్ నాయకులు వి.విశ్వనాథం జెండా ఆవిష్కరించారు. యుటిఎఫ్ కార్యాలయం వద్ద జరిగిన కార్యక్రమంలో వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ప్రతి యుటిఎఫ్ కార్యకర్త ప్రభుత్వ పాఠశాలకు వచ్చే విద్యార్థికి నాణ్యమైన విద్యను అందించే బాధ్యతను తీసుకోవాలన్నారు. యుటిఎఫ్ రాష్ట్ర మాజీ అధ్యక్షులు కె.జోజయ్య మాట్లాడుతూ చెన్నుపాటి లక్ష్మయ్య, అప్పారి వెంకటస్వామి, రామిరెడ్డి త్యాగధనులు స్థాపించినటువంటి సంఘంలో ఈరోజు మనందరం సభ్యులుగా ఉండటం ప్రతీ కార్యకర్త గర్వించదగ్గ విషయం అన్నారు. ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు మాట్లాడుతూ అధ్యయనం, అధ్యాపనం, సామాజిక స్పహ యుటిఎఫ్ లక్ష్యాలు అని, ఉపాధ్యాయులు వాటిని తూచా తప్పక పాటించాలని సూచించారు. మంగళగిరికి చేరిన జాతాకు స్థానిక వడ్లపూడి సెంటర్లో ఘన స్వాగతం లభిచింది. అనంతరం బైక్ ర్యాలీలో మిద్దె సెంటర్ మీదుగా గౌతమ్ బుద్ధ రోడ్డు, పాత బస్టాండ్, కొత్త బస్టాండ్ సెంటర్ మీదగా నిమ్మగడ్డ రామ్మోహన్‌రావు విగ్రహం వరకు ర్యాలీ సాగింది. అనంతరం జెండాను సీనియర్ నాయకులు డి.మాలకొండయ్య ఆవిష్కరించారు. కార్యక్రమానికి టి.ఆంజనేయులు అధ్యక్షత వహించగా రాష్ట్ర సహాధ్యక్షులు ఎఎస్‌ఎన్ కుసుమకుమారి మాట్లాడారు. జిపిఎస్‌ను రద్దు చేసి ఒపిఎస్‌ను అమలు చేసే వరకూ పోరాడతామని చెప్పారు. ఐక్య ఉపాధ్యాయ పత్రిక సంపాదకులు కె.కుమార్‌రాజా మాట్లాడుతూ ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణ కోసం యుటిఎఫ్ పోరాడుతుందన్నారు. అనంతరం నిమ్మగడ్డ రామ్మోహన్ రావు విగ్రహానికి, అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమాల్లో యుటిఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బి.ఆదిలక్ష్మి ఎం.కళాధర్, రాష్ట్ర ప్రచురణల విభాగం చైర్మన్ ఎం.హనుమంతరావు, నాయకులు కెఎస్‌వి దుర్గారావు, ఎన్.తాండవకృష్ణ. సి.ఎచ్ వీరబ్రహ్మం, ఎ.శ్రీనివాసరావు, బసవేశ్వరరావు, యు.రాజశేఖర్, శివపార్వతి, జి.వెంకటేశ్వరరావు, ఎం.కోటిరెడ్డి, సైదా నాయక్, ఎస్.కె రెహమాన్, సిహెచ్.శివనాగేశ్వరావు, సుబ్బారావు, ఆదినారాయణ, రాధాకృష్ణ, సిఐటియు నాయకులు ఎస్‌ఎస్ చెంగయ్య, ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.బాలకృష్ణ, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షులు ఎం.బాలాజీ, ఎయిమ్స్ ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు కె.బుచ్చిబాబు, జి.శ్రీనివాసరావు, శంకర్ పాల్గొన్నారు.