
మైనార్టీలను లక్ష్యంగా చేసుకుని హిందుత్వ మతోన్మాదులు చేస్తున్న విద్వేష ప్రసంగాలపై అత్యున్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేయడం సముచితం. ధర్మ సంసద్‌ల పేరుతో కాషాయ ముసుగులు వేసుకున్న కొందరు ఉన్మాదులు చిమ్ముతున్న విషం ఇప్పటికే దేశానికి తీవ్ర నష్టం చేసింది. ఒక వ్యూహం ప్రకారం ప్రసంగాలతో విద్వేషాన్ని రెచ్చగొడుతూ సంఫ్‌ుపరివార్ శక్తులు దేశంలో మారణహోమాన్ని సృష్టిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా రూర్కీ, ఉనాల్లో జరప తలపెట్టిన ధర్మ సంసద్‌లలో విద్వేష ప్రసంగాలను అడ్డుకోవడానికి ఏం చేస్తారో, అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకుంటే ఎలా అడ్డుకుంటారో స్పష్టంగా చెప్పాలని సుప్రీంకోర్టు ధర్మాసనం ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాల తరువాతైనా ఆ ప్రభుత్వాలు ఏ మేరకు స్పందిస్తాయో, ఎటువంటి నివారణ చర్యలు తీసుకుంటాయో చూడాల్సి ఉంది. నిజానికి ధర్మసంసద్‌ల్లోనే కాదు, అవకాశమున్న ప్రతి చోట హిందుత్వ మతోన్మాదులు ఈ తరహా విషాన్ని చిమ్ముతూనే ఉన్నారు. ఎన్నడూ లేని విధంగా శ్రీరామనవమి, హనుమాన్ జయంతి సందర్భంగా దేశంలోని అనేక ప్రాంతాల్లో హింస చెలరేగడానికి కొద్ది రోజుల ముందు ఆర్‌ఎస్‌ఎస్ అధినేత మోహన్ భగవత్ చేసిన ప్రసంగమే కారణమన్న వార్తలు వచ్చాయి. ఏప్రిల్ 13న హరిద్వార్‌లో చేసిన ప్రసంగంలో అఖండ భారత్ నిర్మాణమే లక్ష్యమని, దాని కోసం ప్రతి హిందువు 'గట్టి కర్ర' లను చేతబట్టాలని పిలుపునిచ్చారు. ఈ దిశలో రానున్న 10-15 సంవత్సరాలకు సంబంధించిన ఒక ప్రణాళికను కూడా ఆయన ప్రకటించినట్లు సమాచారం. ఈ ప్రసంగం తరువాత ఢిల్లీ, గుజరాత్, రాజస్థాన్, మధ్య ప్రదేశ్, కర్ణాటకల్లో ముస్లింలను లక్ష్యంగా చేసుకుని దాడులు జరిగాయి. దాదాపుగా అన్ని రాష్ట్రాల్లోనూ మతోన్మాదులు కత్తులు, కర్రలను బాహాటంగా ప్రదర్శించారు. 'బలాన్ని కలిగి ఉండటమే కాదు. దాన్ని బాహాటంగా, ఎవరికి భయపడకుండా ప్రదర్శించాలి' అంటూ అర్‌ఎస్‌ఎస్ చీఫ్ చేసిన ఉద్బోధే ఈ తరహా బరితెగింపునకు కారణమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఢిల్లీకి చెందిన ఒక సామాజిక సాంస్కృతిక సంస్థ ప్రభుత్వ రికార్డుల ఆధారంగా చేసిన పరిశోధనలో 2014 నుండి 2022 వరకు దేశ వ్యాప్తంగా 878 విద్వేష ప్రసంగాలకు సంబంధించిన కేసులు నమోదయ్యాయి. మొత్తం నమోదైన కేసుల్లో 54 శాతం విద్వేష ప్రసంగాలకు సంబంధించినవి కాగా, 46 శాతం దాడులవి! ప్రసంగాలతో విషం చిమ్మిన తరువాతే దాడులు జరుగుతున్నాయని ఈ పరిశోధన స్పష్టం చేసింది. 2017లో ఈ తరహా సంఘటనలు అత్యధికంగా ( 284 కేసులు ) నమోదయ్యాయి. అదే సమయంలో ఎన్‌డిటివి విడుదల చేసిన గణాంకాల ప్రకారం 2019 నుండి 2022 సంవత్సరాల మధ్య విద్వేష ప్రసంగాల్లో 500 శాతం పెరుగుదల నమోదైంది. దాదాపుగా ఈ అన్ని సంఘటనల్లోనూ ప్రసంగాల తరువాత చెలరేగిన హింసలో ముస్లింలు లక్ష్యంగా మారారు. ఈ సంఘటనలన్నీ పోలీస్ రికార్డులకు ఎక్కకపోవడానికి కారణమేంటో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. గత ఏడాది డిసెంబర్ 19న హరిద్వార్‌లో జరిగిన ధర్మసంసద్‌లో ముస్లింలను హతమార్చాలంటూ విచ్చలవిడిగా చేసిన ప్రసంగాలపై కూడా స్థానిక పోలీసులు కేసు నమోదు చేయలేదు. సైన్యానికి చెందిన ముగ్గురు రిటైర్డ్ ఉద్యోగులు సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌తోనే ఆ విషయంలో కదలిక ప్రారంభమైంది. బిజెపి పాలిత రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు విద్వేష ప్రసంగాలు, దాడుల పట్ల ఉద్దేశ్యపూర్వకంగానే ఉదాశీనంగా వ్యవహరిస్తున్నాయనడానికి ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలి?
మరో అధ్యయనం ప్రకారం 2014 నుండి 2018 వరకు తొలి విడత నరేంద్రమోడీ పాలనలో మైనార్టీలపై దాడులు 82 శాతం పెరిగాయి. 2019 లోక్‌సభ ఎన్నికల్లో బిజెపి ఓట్లు 2014తో పోలిస్తే దేశవ్యాప్తంగా 2.24 శాతం పెరిగాయి. ఒక పథకం ప్రకారం చిమ్ముతున్న విద్వేష విషం వెనుక ఎవరి ప్రయోజనాలు దాగి ఉన్నాయో అర్ధం చేసుకోవడానికి ఇవి నిదర్శనాలు. దేశంలో నెలకొన్న ఈ విద్వేష వాతావరణం మారాలంటే లౌకిక ప్రజాతంత్ర శక్తులు ఏకం కావాలి. మతోన్మాదంపై రాజీ లేని పోరు చేయాలి. ప్రజలలో లౌకిక స్ఫూర్తిని నింపాలి. బిజెపిని ఒంటరిపాటు చేయాలి, ఓడించాలి.