Oct 21,2023 20:40

విక్రయ కేంద్రాన్ని ప్రారంభిస్తున్న ఐటిడిఎ పిఒ విష్ణుచరణ్‌

ప్రజాశక్తి - పార్వతీపురం : వన్‌ ధన్‌ వికాస్‌ కేంద్రాల (విడివికె) ఉత్పత్తులు జద్విఖ్యాతి కావాలని ఐటిడిఎ ప్రాజెక్టు అధికారి సి.విష్ణుచరణ్‌ అన్నారు. మండలంలోని అడారులో అగర్‌బత్తీ తయారు కేంద్రాన్ని శనివారం ఆయన సందర్శించారు. విడివికెలు ఉత్పత్తి చేస్తున్న అగర్‌బత్తులు నాణ్యత కలిగి ఉన్నాయని ఆయన ప్రశంసించారు. ఉత్పాదకాలు జిల్లా స్థాయి వరకు మాత్రమే కాకుండా రాష్ట్ర, జాతీయ స్థాయిలోకి వెళ్లాలని ఆయన చెప్పారు. ఇందుకు అవసరమగు సహాయ సహకారాలు ఐటిడిఎ అందిస్తుందని ఆయన అన్నారు. స్థానికంగా లభ్యమయ్యే ముడిసరుకులు వినియోగిం చుకోవాలని తద్వారా విలువ ఆధారిత ఉత్పాదకాలు రావాలని పిలుపునిచ్చారు. నాణ్యతలో రాజీ లేకుండా ఉత్పాదకాలను విశ్వ విఖ్యాతం చేయాలని సూచించారు. ఈ జిల్లా అగర్‌ బత్తులు ప్రఖ్యాతిగాంచిన బ్రాండ్ల సరసన చేరాలని ఆయన ఆకాంక్షించారు. తద్వారా భారీ స్థాయి పరిశ్రమగా మారుతుందని, మరింత ఎక్కువ మందికి జీవనోపాధులు లభిస్తుందని అన్నారు. గిరిజన కుటుంబాలు ఆర్థికంగా అభ్యు న్నతి సాధించాలని, అందుకు అనుగుణంగా పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో గిరి వెలుగు ఏపిడి వై. సత్యం నాయుడు తదితరులు పాల్గొన్నారు.